అశ్వారావుపేటలో కేరళ మోడల్ భవనం
నవతెలంగాణ – అశ్వారావుపేట
గోవా, ఊటీ రిసార్ట్‌లా కనిపిస్తున్న ఈ భవనం.. ఏదో అతిథి గృహం అనుకుంటున్నారా.. కానే కాదు ఇది ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే అత్యాధునిక అంగన్వాడీ కేంద్రం. అశ్వారావుపేట మండలం కోయ రంగాపురం పంచాయతీ గుంటిమడుగు లో “కేరళ” నమూనాలో ఈ భవనం నిర్మించారు.

ప్రస్తుతం ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కేరళలో ప్రభుత్వ శాఖలు, అంగన్వాడీ ల నిర్వహణను అధ్యయనం చేసిన అనంతరం అదే తరహా మోడల్ భవనాలను తన నియోజకవర్గానికి తీసుకొచ్చారు. మండలానికి రెండు చొప్పున మంజూరి చేయించారు. అశ్వారావుపేట మండలంలో రెండు అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ఒకటి గుంటిమడుగులో, మరొకటి అశ్వారావుపేట మున్సిపాల్టీలో ఈ భవనాలకు ఒక్కోటి రూ.14 లక్షల వ్యయం కాగా, నవంబర్ 2024 లో శంకుస్థాపన జరగగా, ఈ నెలలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఐసీడీఎస్ సూపర్వైజర్ సౌజన్య తెలిపారు. గ్రామీణ పిల్లలకు ఇప్పుడు రిసార్ట్‌లా కనిపించే, రేపటి పౌరులను తయారు చేసే అంగన్వాడీ కేంద్రం అందుబాటులోకి రానుంది.




