Sunday, May 4, 2025
Homeజాతీయంపారిశుధ్య కార్మికుల గోడు పట్టని ప్రభుత్వం

పారిశుధ్య కార్మికుల గోడు పట్టని ప్రభుత్వం

- Advertisement -

– శ్రమ దోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్లు
– ప్రమాదాల్లో తెల్లారిపోతున్న బతుకులు
– కలగానే మిగిలిన మానవ రహిత పనులు
– పదేండ్ల స్వచ్ఛ భారత్‌లోనూ మారని జీవితాలు

న్యూఢిల్లీ : దేశంలోనే అతి పెద్ద పారిశుధ్య ప్రాజెక్ట్‌ ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’ గత సంవత్సరం అక్టోబరులో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారత్‌ను బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మార్చడమే దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పది కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించింది. టాయిలెట్ల వినియోగం, పరిశుభ్రత గురించి ప్రజలలో అవగాహన కల్పించింది. తద్వారా ప్రజల జీవన శైలిలో మార్పులకు ప్రయత్నించింది. పట్టణ ప్రాంతాలలో జన సాంద్రత పెరుగుతున్న నేపథ్యంలో మురుగునీటి వ్యవస్థపై భారం అధికమవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛ భారత్‌ మిషన్‌-యు (ఎస్‌బీఎం-యు) 2.0ను కేంద్రం ప్రాంంభించింది. పట్టణాలలో మురుగునీటి నిర్వహణను మెరుగుపరచడం, మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లను అభివృద్ధి చేయడంపై సర్కారు దృష్టి సారించింది.
పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచడానికి ఎన్నో చర్యలు చేపడుతున్న ప్రభుత్వం పట్టణ మురుగునీటి నిర్వహణ వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న కార్మికులను మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పారిశుధ్య పనులను వ్యక్తులు లేదా సంస్థలకు కాంట్రాక్ట్‌ ఇస్తుండడంతో ప్రభుత్వ జోక్యం లేకుండా పోతోంది. ప్రయివేటు సంస్థలు, మూడో పార్టీ ఏజెన్సీలకు పారిశుధ్య పనులను అవుట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం శ్రమ దోపిడీకి దారితీస్తోంది. పరిశోధకులు, హక్కుల కార్యకర్తలతో కూడిన దళిత్‌ ఆదివాసీ శక్తి అధికార్‌ మంచ్‌ అనే సంస్థ రాజధాని ఢిల్లీలో మురుగు నీటి పనులు, మౌలిక సదుపాయాలపై ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. అందులో అనేక చేదు నిజాలు వెలుగు చూశాయి.
గాలిలో కలుస్తున్న ప్రాణాలు
కాంట్రాక్టర్లు, ఔట్‌సోర్సింగ్‌ సంస్థలు దినసరి వేతనాలపై కార్మికులను పనిలోకి తీసుకొని వారికి పారిశుధ్య పనులు అప్పగిస్తుంటాయి. వీరిలో ఎక్కువ మంది అణగారిన వర్గాలకు చెందిన వారే. స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు ప్రభుత్వం భారీగానే నిధులు అందజేస్తున్నప్పటికీ వ్యవస్థలో ఆధునీకరణ నామమాత్రంగానే కన్పిస్తోంది. గత దశాబ్ద కాలంలో దేశంలో మురుగునీటి కాలువలు, సెప్టిక్‌ ట్యాంకులు శుభ్రం చేస్తూ 453 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ డేటా ప్రకారం ఒక్క ఢిల్లీలోనే 2019-2023 మధ్యకాలంలో సుమారు 377 మంది, 2013-2014 మధ్యకాలంలో 72 మంది చనిపోయారు. గత సంవత్సరం మేలో నోయిడాలో మురుగునీరు అధికంగా ఉన్న ఓ కాలనీలో ఇంటి ప్రయివేటు సెప్టిక్‌ ట్యాంకును శుభ్రం చేస్తుండగా విష వాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు చనిపోయారు. వాయవ్య ఢిల్లీలోని ఓ మాల్‌లో మూసుకు పోయిన మురుగునీటి కాలువలోకి ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ప్రవేశించిన మరో ఇద్దరు కన్నుమూశారు. వీరందరూ ఔట్‌సోర్సింగ్‌ పనులు చేస్తున్న సంస్థల తరఫున కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న వారే. గత ఏడాది అక్టోబరులో ఢిల్లీలోని నైరుతి ప్రాంతంలో ఓ నిర్మాణ ప్రదేశంలో మురుగునీటి కాలువను శుభ్రం చేస్తూ ముగ్గురు చనిపోయారు. గత ఐదు నెలల కాలంలో మురుగునీటి కాలువలు, సెప్టిక్‌ ట్యాంకులు శుభ్రం చేస్తూ ఢిల్లీలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
భద్రతా చర్యలేవి?
తగినన్ని జాగ్రత్తలు పాటించకుండా, రక్షణ పరికరాలు లేకుండా, భద్రతా పరమైన చర్యలు చేపట్టకుండా కార్మికులతో పారిశుధ్య పనులు చేయించుకోవడం చట్టవిరుద్ధం. అయితే చట్టం అమలులో ఉన్నప్పటికీ ఆ పనులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మున్సిపాలిటీల నియంత్రణ, జవాబుదారీతనం లేకపోవడం ఔట్‌సోర్సింగ్‌ సంస్థలకు వరంగా మారింది. వారు ఆడింది ఆట…పాడింది పాటలా సాగుతోంది. కార్మికులకు అవసరమైన శిక్షణ ఇవ్వడం, వారి పనులను పర్యవేక్షించడం జరగడం లేదు. భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసి శిక్షణ పొందని అనధికారిక కార్మికులను పారిశుధ్య పనులకు పిలిపించుకోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరణాలను తరచూ ‘ప్రమాదవశాత్తూ’ జరిగినవిగా చిత్రీకరిస్తున్నారు.
పేదలే అధికం
పారిశుధ్య కార్మికులలో ఎక్కువ మంది పేదలు, అణగారిన వర్గాలకు చెందిన వారు, వలసదారులే ఉంటున్నారు. ఏ మాత్రం అనుభవం లేకున్నా విధిలేని పరిస్థితులలో జీవనాధారం కోసం ప్రమాదకరమైన పారిశుధ్య పనులు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ప్రమాదాలలో మరణించిన వారి తరఫున చట్టపరంగా పోరాడేందుకు కుటుంబసభ్యులకు తగిన ఆర్థిక వనరులు ఉండవు. కాంట్రాక్టర్‌ విదిల్చే కొద్దిపాటి సొమ్మును తీసుకొని సరిపెట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితి. పారిశుధ్య పనులు చేస్తున్న వారందరూ దాదాపుగా కాంట్రాక్ట్‌ కార్మికులే. వీరిలో ఎలాంటి చట్టపరమైన రక్షణ ఉండదు. జీతాలు దారుణంగా ఉంటాయి. వాటిలోనూ కోతలు. గుర్తింపు కార్దులు ఉండవు. ఆరోగ్య భద్రత వంటి సామాజిక నిబంధనలు పాటించే నాథుడే ఉండడు. ప్రమాదకరమైన పనులు చేస్తున్నా జీవనోపాధికి గ్యారంటీ ఉండదు. పైగా పారిశుధ్య వ్యవస్థ కుల అసమానతలను తీవ్రతరం చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -