నవతెలంగాణ-హైదరాబాద్: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన రాసలీలల వీడియో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది జనసేన కాదని, మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ‘కామసేన’ అని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆమె సొంత నియోజకవర్గమైన నగరిలో వైసీపీ శ్రేణులతో కలిసి భారీ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “ఆడవాళ్లకు అన్యాయం చేస్తే రోమాలు పీకేస్తా, చర్మం ఒలుస్తా అని ఊగిపోయే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ? ఏం చేస్తున్నారు?” అని సూటిగా ప్రశ్నించారు. “గతంలో జానీ మాస్టర్, కిరణ్ రాయల్, వినూత్న వంటి వారు తప్పు చేసినప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే, ఈరోజు మీ ఎమ్మెల్యే శ్రీధర్ ఇంతటి దుశ్చర్యకు పాల్పడేవాడా?” అని నిలదీశారు. వీడియోలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, త్రీ-మెన్ కమిటీ వేసి కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు, స్పెషల్ ఫ్లైట్ల కోసమే పవన్ రాష్ట్రానికి వస్తారని, ప్రజల కష్టాలను పట్టించుకోరని ఆరోపించారు.



