నవతెలంగాణ-హైదరాబాద్: ఈ నెల 23వ తేదీలోపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సభాపతి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. తనకు నోటీసులు అందాయని తెలిపారు. అయితే, వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని సభాపతిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు.
సభాపతి ఇచ్చిన గడువులోగా వివరణ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. సభాపతి తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నందునే స్టేషన్ ఘనపూర్‌కు పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే తాను తిరిగి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలు తనను ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.



