నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలు బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్లను భర్తీ చేసుకునేందుకు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ రోజు ఆయా కళాశాలలు నోటిఫికేషన్ జారీ చేస్తాయి. ఈ సీట్లకు సంబంధించి ప్రవేశాలను ఆగస్టు 10 నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఈ మేరకు ఛైర్మన్ ఆచార్య బి.బాలకిష్టారెడ్డి గురువారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. కన్వీనర్ కోటా కింద 70% సీట్లను ప్రభుత్వం కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన 30 శాతాన్ని బీ కేటగిరీగా పిలుస్తారు. నిబంధనల ప్రకారం ఆ సీట్లను కూడా కన్వీనర్ కోటా ఫీజుతోనే మెరిట్ ఆధారంగా ఇవ్వాల్సి ఉండగా.. అధిక శాతం కళాశాలలు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు డొనేషన్ల పేరిట తీసుకొని సీట్లు విక్రయిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. కొన్ని కళాశాలలు 30 శాతంలో సగం సీట్లను ఎన్‌ఆర్‌ఐ/ ఎన్‌ఆర్‌ఐ ప్రాయోజిత అభ్యర్థులకు కేటాయిస్తాయి. ఆ సీట్లకు గరిష్ఠంగా 5 వేల అమెరికన్ డాలర్లకు సమానంగా ఫీజు తీసుకోవచ్చు. అయితే డిమాండ్ లేకపోవడంతో సీఎస్‌ఈ, సంబంధిత బ్రాంచీలకు తప్ప మిగిలినవాటికి ఫీజులు సగానికిపైగా తగ్గిస్తున్నాయి.
తెలంగాణలో ఇంజినీరింగ్ బీ కేటగిరీ సీట్ల భర్తీకి రేపు నోటిఫికేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES