Tuesday, April 29, 2025
Navatelangana
Homeఎడిట్ పేజిఇక జైనుల వంతా?!

ఇక జైనుల వంతా?!

- Advertisement -

చట్టవ్యతిరేకమైన, రాజ్యాంగ విరుద్ధమైన బుల్డోజింగ్‌ని ఒక సంస్కృతిగా మార్చే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ముఖ్యంగా మైనారీటీలను లక్ష్యంగా కూల్చివేతల దుర్మార్గం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ”ఈ దేశంలో చట్టాలు, నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని కాలదన్ని కూల్చివేతలకు పాల్పడడం అమానవీయం. కూల్చివేతలు ఒక ఫ్యాషన్‌గా మారకూడదు” అని సుప్రీంకోర్టు డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ను చీవాట్లు పెట్టి రెండు వారాలు కూడా కాకముందే… ముంబయిలో జైనులు ఎక్కువగా వుండే విలేపార్లే ప్రాంతంలో పార్శ్వనాథ మందిరంపైకి బుల్డోజర్లును పంపింది. ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే ప్రతీకార ధోరణికి స్వస్తి పలకాలన్న సర్వోన్నత న్యాయ స్థానం… అక్రమ నిర్మాణాల పట్ల వ్యవహరిం చాల్సిన విధివిధానాలను కూడా ప్రకటించి, అవి దేశం మొత్తానికి వర్తిస్తాయని స్పష్టంగా చెప్పింది. కాషాయ పాలకులు వాటిని బేఖాతరు చేసి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రనడానికి జైన మందిర కూల్చివేత తాజా ఉదాహరణ.
కాంబ్లీవాడీలో నేమీనాథ్‌ సహకార గృహ నిర్మాణ సంఘ ఆవరణలో ఉన్న జైన మందిరాన్ని కూల్చేయడంపై విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ మందిరానికి మరమ్మతులు సైతం బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అనుమతితోనే చేశారు. ఫడ్నవిస్‌ సర్కారు అప్పుడేం చేసింది? ఇలాంటి నిర్మాణాలను క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ తీర్మానం మేరకు మందిర ధర్మకర్త బీఎంసీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. అప్పుడైనా మహారాష్ట్ర ప్రభుత్వానికి గానీ, బీఎంసీ అధికారులకు గానీ ఈ మందిరాన్ని అక్రమంగా నిర్మించారన్న స్పృహ ఎందుకు కలగలేదు?
జైన మతానుయాయులు శనివారం కె-తూర్పు వార్డ్‌ ఆఫీసు దగ్గర భారీ సంఖ్యలో నిరసనకు దిగారు. మందిరాన్ని కూల్చి వేయడం వల్ల కొన్ని మతపరమైన గ్రంథాలు కూడా ధ్వంసం అయిపోయాయి. అక్రమంగా నిర్మించింది మందిరం అయితే ఆ విషయమై చర్య తీసుకోవడానికి బీఎంసీ అధికారులకు అధికారం ఉండొచ్చు. కానీ ఆ క్రమంలో మత గ్రంథాలను కూడా ధ్వంసం చేసే అధికారం ఎక్కడిదని వారు ప్రశ్నిస్తున్నారు. స్థానిక హోటల్‌ యజమానికి మేలు చేసేందుకే ఈ మందిరాన్ని కూల్చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. అదే నిజమైతే బీజేపీ ప్రభుత్వం ఇతర మతాల మీద దాడి చేయడమే కాదు, తమకు అనుకూలురైన వ్యాపారస్థులకు కొమ్ము కాస్తోందని భావించవలసి వస్తుంది. ఈ విధ్వంసకాండపై స్పందించాల్సిన అధికారులు ముఖం చాటేయడంతో అనుమానాలకు మరింత ఊతం ఇస్తున్నాయి.
జైన, బౌద్ధ మతాలు మన దేశంలో పుట్టినవేగా! వాటిని కూడా కూలుస్తారా? ఇస్లాం, క్రైస్తవం లాంటి మతాలను తప్పిస్తే మిగతా మతాలన్నింటినీ హిందూ మతంలో భాగమేనని వాదించే బీజేపీ ఇప్పుడు జైనుల మీద కత్తిగట్టడానికి కారణం ఏమిటి? వంటి అనేక ప్రశ్నలు తల్తెతున్నాయి. ఈ నిరసనలో స్వయంగా ఓ మహారాష్ట్ర మంత్రి, ఓ శాసన సభ్యుడు కూడా చేరిపోయారు. జైన మందిరాన్ని కూల్చేయడానికి ముందు బీఎంసీ అధికారులు ఆ సంస్థ నిర్వాహకులకు నోటీసు జారీ చేసింది నిజమే. కానీ మందిర నిర్వాహకులు ముంబయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం… కోర్టు స్టే ఆర్డర్‌ ఇవ్వడం జరిగిపోయాయి. అయినా బీఎంసీ పార్శ్వనాథ మందిరాన్ని కూల్చేయడం దుస్సాహసమే. న్యాయస్థానాలంటే లెక్క లేకపోవడమే. ఇందుకు డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ప్రోద్బలమే కారణం కావొచ్చు.
శనివారం వారి నిరసన ప్రదర్శన భారీదే అయినా శాంతియుత పద్ధతిలోనే జరిగింది. బీజేపీ ధోరణి చూస్తూ ఉంటే ఎవరినీ వదిలిపెట్టేట్టుగా కనిపించడం లేదు. నిన్నటికి నిన్న ఈస్టర్‌ పండుగ సందర్భంగా అహ్మదాబాద్‌ ఒదావ్‌ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవుల మీద మతోన్మాదులు కత్తులు, కర్రలతో దాడుల చేయడం చూస్తుంటే ఇది లౌకికదేశమా కాదా అన్న సందేహం కలుగుతుంది. ముస్లింలు మాత్రమే కాదు ఏ అల్పసంఖ్యాక వర్గాలనైనా సహించే స్థితిలో సంఫ్‌ు పరివార్‌ సర్కారు లేదని స్పష్టం అయిపోయింది. కుల భేదాలకు స్వస్తి పలికి, సామాజిక ఐక్యత సాధించాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) అధినేత మోహన్‌ భగవత్‌ వారి పరివారానికి పిలుపునిచ్చారు. అంటే దానికి వ్యతిరేకంగా చేయడమేనా? ప్రార్థనా స్థలాలు, కట్టడాల స్వభావాన్ని మార్చకూడదని నిర్దేశించే 1991 నాటి చట్టాన్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు. కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటమే లక్ష్యంగా బరి తెగిస్తున్న బుల్డోజింగ్‌ పాలకులకు ఏ తీర్పులు కనువిప్పు కల్గిస్తాయి. ఒక్క ప్రజల తీర్పు తప్ప.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు