దామాషా నిధులు కేటాయింపు ఉండాలి
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో స్పష్టం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఓబీసీ క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని సవరించడం తక్షణ అవసరమని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. శుక్రవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ఈ పరిమితి అర్హత కలిగిన ఓబీసీ కుటుంబాల్లో ఎక్కువ భాగాన్ని రిజర్వేషన్ ప్రయోజనాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి మినహాయించిందని పేర్కొంది. వార్షిక ఆదాయ పరిమితిని రూ.6.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు 2017లో సవరించారని తెలిపింది. సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) నిబంధనల ప్రకారం అవసరమైతే ప్రతి మూడేళ్లకు ఒకసారి, లేదా అంతకంటే ముందుగానే పరిమితిని సమీక్షించాలని పేర్కొంది. ప్రస్తుతం పరిమితి తక్కువగా ఉందని, ఒబిసిలలో ఒక తక్కువ భాగాన్ని మాత్రమే కవర్ చేస్తుదని కమిటీ తెలిపింది. ద్రవ్యోల్బణం, తక్కువ ఆదాయ వర్గాల్లో పెరుగుతున్న ఆదాయాలు సవరణను అవసరంగా మార్చాయని పేర్కొంది. ఓబీసీ లకు క్రిమిలేయర్‌ను నిర్ణయించడానికి ఆదాయ పరిమితిని ప్రతి మూడేండ్లకు ఒకసారి, లేదా నిర్ణీత కాలానికి ముందే సమీక్షించాలనే వాస్తం కమిటీకి తెలుసని పేర్కొంది. అయితే 2017 నుంచి అది సవరణకు నోచుకోలేదని తెలిపింది. కనుక ప్రస్తుత క్రిమి లేయర్ పరిమితిని సమీక్షించి, తదనుగుణంగా సవరించాలని సూచించింది. తద్వారా ఓబీసీల్లో ఎక్కువ మందికి కవర్ అవుతుందని, ఇది వారి సామాజిక, ఆర్థిక స్థితిని పెంచడంలో సహాయపడుతుందని కమిటీ పేర్కొంది.
అయితే సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ క్రిమిలేయర్ పరిమితిని సవరించే ప్రతిపాదన పరిశీలనలో లేదని కమిటీకి తెలిపిందని పేర్కొంది. క్రిమిలేయర్ స్థితిని నిర్ణయించడానికి స్వయం ప్రతిపత్తి సంస్థలలోని పోస్టులు, ప్రభుత్వ పదవుల మధ్య సమానత్వం లేకపోవడం వంటి మరో పరిష్కారం కమిటి గుర్తించిందని తన నివేదికలో తెలిపింది. అటువంటి సమానత్వం లేకపోవడం వల్ల యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారితో సహా అర్హత కలిగిన ఓబీసీ అభ్యర్థులకు సర్వీస్ కేటాయింపు నిరాకరించబడిందని పేర్కొంది. స్కాలర్‌షిప్ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గడంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రి మెట్రిక్ పథకం కింద లబ్ధిదారులు 2021-22లో 58.6 లక్షల నుండి 2023-24లో 20.29 లక్షలకు తగ్గారని, ఖర్చు రూ.218.29 కోట్ల నుండి రూ.193.83 కోట్లకు తగ్గిందని పేర్కొంది. పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ పథకం కింద లబ్ధిదారుల సంఖ్య 38.04 లక్షల నుండి 27.51 లక్షలకు తగ్గిందని, ఖర్చు రూ.1,320 కోట్లు నుంచి రూ.988 కోట్లకు తగ్గిందని కమిటీ పేర్కొంది.
ఇందుకు నిధుల విడుదలలో జాప్యం, ఆధార్ ఆధారిత ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, ఆన్‌లైన్ పోర్టల్‌లకు వంటి సమస్యలు ప్రధాన కారణాలుగా పేర్కొంది. మండల్ కమిషన్ ప్రకారం దేశ జనాభాలో ఓబీసీ లు 52 శాతం ఉన్నారని, అయినప్పటికీ వారి కేంద్ర గ్రాంట్లు జనాభాలో దాదాపు 16.6 శాతం ఉన్న ఎస్‌సి కులాల వారితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఓబీసీ ప్రజల సంఖ్య, అవసరాలను ప్రతిబింబించేలా దామాషా నిధులు కేటాయింపు ఉండాలని కమిటీ సూచించింది.
ఓబీసీ క్రిమిలేయర్ ఆదాయ పరిమితి సవరణ తక్షణవసరం
- Advertisement -
- Advertisement -