Thursday, March 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్చి 25న “పెన్షన్ బ్లాక్ డే”గా పాటించండి

మార్చి 25న “పెన్షన్ బ్లాక్ డే”గా పాటించండి

- Advertisement -

–  ఎస్‌జిపిఏటి జిల్లా అధ్యక్షులు హనుమంత్ రెడ్డి పిలుపు
నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉద్యోగ పెన్షనర్లు ఈ నెల 25వ తేదీని “పెన్షన్ బ్లాక్ డే”గా పాటించాలని ఎస్‌జిపిఏటి జిల్లా అధ్యక్షులు హనుమంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (AISPF), న్యూ ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర పెన్షనర్స్ జేఏసీ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే నిరసన ప్రదర్శనలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ విషయంపై గురువారం రిటైర్డ్ ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎస్‌జిపిఏటి జిల్లా కమిటీ సమావేశంలో అధ్యక్షత వహించిన హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, 2025 మార్చి 25న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో “వాలిడేషన్ యాక్ట్”ను ప్రవేశపెట్టి చట్టంగా అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ చట్టం ప్రకారం 2026 జనవరి 1కు ముందు, తరువాత రిటైర్ అయిన వారిని రెండు వర్గాలుగా విభజించారని తెలిపారు. 2026కు ముందు రిటైర్ అయిన వారికి ఇదే చివరి పీఆర్‌సీగా పరిగణించి, భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలపై అనిశ్చితి నెలకొల్పిందని అన్నారు. పెన్షన్ ఇవ్వాలా వద్దా, పెన్షనరీ ప్రయోజనాలు కొనసాగించాలా వద్దా అనే అధికారాలను పార్లమెంట్‌కు అప్పగించడం పెన్షనర్లకు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని విమర్శించారు.

అదేవిధంగా వేతన సవరణలు, కరువు భత్యం వంటి అంశాలపై కూడా స్పష్టత లేకపోవడం వల్ల పెన్షనర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. ఈ చట్టం సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మార్చి 25న నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వులను ప్రతీకాత్మకంగా చింపివేస్తూ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. అదే రోజు భారత ప్రధానమంత్రికి విజ్ఞాపన పత్రం పంపిస్తూ, ఆ ప్రతిని జిల్లా కలెక్టర్‌కు అందజేసి కేంద్ర ప్రభుత్వానికి చట్టాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరామరాజు, జిల్లా కార్యదర్శులు రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, రాజలింగం, సుబ్రహ్మణ్యం, సత్తయ్య, రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -