– అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న : సింగరేణి మెయిన్ వర్క్‌షాప్ డ్రైవర్ రాజేశ్వరరావు
– ములుగు జెడ్పీ కార్యాలయంలో సోదాలు
నవతెలంగాణ-కొత్తగూడెం/ములుగు
ఏసీబీ దాడుల్లో కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో అధికారులు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి మెయిన్ వర్క్‌షాపు డ్రైవర్ అన్నబోయిన రాజేశ్వరావు.. ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు కార్మికుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూళ్లు చేసినట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని, మెడికల్ అన్‌ఫిట్ చేయిస్తానని, బదిలీలు చేయిస్తానని చెబుతూ పలువురి నుంచి రూ.50 లక్షలు రాజేశ్వరరావు వసూళ్లు చేసినట్టు తెలిపారు. ఆయనతో పాటు మరికొందరు బృందంగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. రాజేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు. మరికొంత మంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. లంచం అడగడం, ఇవ్వడం రెండూ నేరమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.ములుగు జిల్లాకేంద్రంలోని జెడ్సీ కార్యాలయంలో రూ.25వేలు లంచం తీసుకుంటున్న సూపరింటెండెంట్ సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సామ్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జెడ్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు జనవరి 2023 నుంచి అక్టోబర్ 2023 వరకు 2024 జనవరి నుంచి జూన్ వరకు ఆనారోగ్య కారణాలతో సెలవు తీసుకున్నారు. తిరిగి విధులకు హాజరయినా పెండింగ్ వేతనం రాలేదు. సుమారు రూ.3.50 లక్షల వేతనం నిలిచిపోయింది. శాంక్షన్ కావడానికి మెడికల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేశారు. అయినా లాభం లేకపోయింది. చేసేదేమిలేక సూపరిండెంట్‌ను కలవగా.. రూ.60వేలు ఇస్తేనే పెండింగ్ వేతనం వచ్చేలా చూస్తామని చెప్పారు. దాంతో ముందుగా రూ.25 వేలు ఇస్తానని ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం ఉదయం విధులకు హాజరైనప్పుడు ముందుగా జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను కలిసి రూ.5 వేలు ఇవ్వబోయాడు. అయితే తన డబ్బులతో పాటు సూపరిండెంట్‌కు ఇవ్వాలిన రూ.20వేలు ఆయనకే ఇవ్వాలని సౌమ్య చెప్పడంతో సూపరింటెండెంట్‌కు రూ.25 వేలు ఇస్తున్న క్రమంలో ఏసీబీ డీఎస్సీ సాంబయ్య ఆధ్వర్యం లోని టీం సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు జెడ్పీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పట్టుబడిన అధికారుల తీరుపై ఆరా తీశారు. గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు.
ఏసీబీ అదుపులో అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES