Saturday, May 17, 2025
Homeజాతీయంఅధికారిక లింగ అంతరాలు

అధికారిక లింగ అంతరాలు

- Advertisement -

– ఫార్మల్‌ సెక్టార్‌లో కఠిన పరిస్థితులు
– ప్రమోషన్లలో దక్కని అవకాశాలు
– మహిళల పురోగతికి ఆటంకం
– భారత్‌, నైజీరియా, కెన్యాలలో ఆందోళనకరం
– మెకిన్సే తాజా నివేదిక వెల్లడి
దేశంలో మహిళల అభ్యున్నత పట్ల తమకెంతో శ్రద్ధ ఉన్నదన్నట్టు ఉపన్యాసాలతో ఊదరగొట్టే మోడీ సర్కారు.. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం పరిష్కరించలేకపోతున్నది. ‘బేటీ బచావో, బేటీ పడావో’, ‘ఉజ్వల్‌ యోజన’, ‘నారీ శక్తి’, అంటూ ఉదాహరణలుగా చూపే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం… ఉద్యోగాల విషయంలో మహిళలకు అడ్డంకిగా మారిన లింగ అంతరం అనే సమస్యను నియంత్రించే విషయంలో మాత్రం విఫలమవుతున్నది. దీంతో అన్ని అర్హతలున్నా.. ప్రతి రంగంలోనూ మహిళలు వెనుకబడి పోతున్నారు. మెకిన్సే నివేదిక ‘ఉమెన్‌ ఇన్‌ ది వర్క్‌ప్లేస్‌ 2025’ నివేదిక ఇదే విషయాన్ని వెల్లడించింది.
న్యూఢిల్లీ:
భారత్‌లో రంగమేదైనా లింగ అంతరం అనే సమస్య ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ సమస్య మాత్రం పూర్తిగా తొలగిపోవటం లేదు. అంతో, ఇంతో ప్రభుత్వ పర్యవేక్షణ ఉండే అధికారిక రంగం (ఫార్మల్‌ సెక్టార్‌)లోనూ ఈ పరిస్థితులే ఉన్నాయి. లింగ అంతరంతో మహిళలు వెనుకబడిపోతున్నారు. ఫార్మల్‌ సెక్టార్‌లలో భారత్‌తో పాటు నైజీరియా, కెన్యా దేశాలలో లింగ అంతరాలు స్పష్టంగా ఉన్నాయని మెకిన్సే నివేదిక చెప్తున్నది. 14 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్న 324 సంస్థల డేటా ఆధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వ్యవస్థాగత అడ్డంకులు, ప్రత్యేక సవాళ్లను ఇది హైలెట్‌ చేసింది. ఈ నివేదిక ప్రకారం… భారత్‌లో ఈ పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. ప్రారంభస్థాయి (ఎంట్రీ లెవెల్‌) నుంచి నిర్వాహక పాత్ర(మేనేజరియల్‌ రోల్స్‌)ల వరకు మహిళల పురోగతికి ఆటంకం కలిగించే కఠిన దశను ఎదుర్కొంటున్నది. భారత్‌లోని అధికారిక ప్రయివేటు రంగం లో మహిళలు తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే విషయం లో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారు తమ కెరీర్‌లో ఎంట్రీ లెవెల్‌ నుంచి నిర్వాహక పాత్రల వరకు ప్రమోషన్లలో అవకాశాలు దక్కటం లేదు. ఇది వారి కెరీర్‌లో పురోగతిని పరిమితం చేస్తున్నది. విశ్వ విద్యాలయం గ్రాడ్యుయేట్లలో దాదాపు సగం మంది వారు ఉన్నప్పటికీ.. ఉన్నత స్థాయిల లో మాత్రం మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నది.
ప్రారంభ అడ్డంకులు, శ్రామిక శక్తిలో తీవ్ర తగ్గుదల
ఫార్మల్‌ సెక్టార్‌లో ముందుకెళ్లే విషయంలో మహిళలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు 48 శాతం ఉంటే.. ప్రారంభస్థాయిలో కేవలం 33 శాతం రోల్స్‌ను వారు పోషిస్తుండటం గమనార్హం. ఇక మేనేజరియల్‌ స్థాయిలో ఈ ప్రాతినిధ్యం ఇంకా తగ్గుదలను చూస్తున్నది. 24 శాతం మంది మాత్రమే ఇలాంటి స్థానాల్లో ఉంటున్నారు. ఈ స్థాయిలో పురుషులు పదోన్నతిని పొందే అవకాశం 2.1 రెట్లు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇది అభివృద్ధి అవకాశాలలో వ్యవస్థాగత లింగ అసమానతలను ఎత్తి చూపుతున్నది. భారత ప్రయివేటు సెక్టార్‌లోని సీ-సూట్‌ స్థానాల్లో 17 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. సీనియర్‌ లీడర్‌షిప్‌నకు వెళ్లటంలో మహిళలకు ఉన్న పరిమిత యాక్సెస్‌ను ఇది తెలియజేస్తున్నది.
శ్రామికశక్తిలోకి ఆలస్యంగా స్త్రీలు
మహిళల ప్రాతినిధ్యం విషయంలో వయసు అనే అంశం కూడా కీలకంగా మారుతున్నది. పురుషుల కంటే మహిళలు శ్రామికశక్తిలో చాలా ఆలస్యం చేరుతారు. ఈ విషయంలో ప్రారంభస్థాయిలో పురుషుల సగటు వయసు 32 ఏండ్లయితే.. మహిళది 39 ఏండ్లుగా ఉన్నది. అంటే సగటు వయసు అంతరం ఏడేండ్లు. కొన్ని రంగాలలో ఈ అసమానతలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. ఆర్థిక సేవలలో మహిళలు ఎంట్రీ-లెవల్‌ పాత్రలలో 31 శాతం ఉన్నారు. కానీ, సీ-సూట్‌ స్థానాల్లో 13 శాతమే ఉండటం గమనార్హం. న్యాయవాద వృత్తి కూడా ఇదే విధమైన క్షీణతను చూపిస్తున్నది. మహిళలు ఎంట్రీ-లెవల్‌ రోల్స్‌లో 51 శాతం ఉన్నారు. కానీ.. సీనియర్‌ లీడర్‌షిప్‌లో మాత్రం వారి వాటా 32 శాతంగానే ఉండటం గమనార్హం.
‘ప్రభుత్వాలు వారిని ప్రోత్సహించాలి’
సామాజిక, కుటుంబ సమస్యలు, బాధ్యతలను ఎదుర్కొని మరీ ఉద్యోగాలు చేస్తున్న మహిళల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా దృష్టిని సారించాలని సామాజికవేత్తలు, కార్యకర్తలు అంటున్నారు. వారిని మరింతగా ప్రోత్సహించాలని చెప్తున్నారు. మహిళాసాధికారతను సాధించటం కోసం మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఈ విషయంలో ఫార్మల్‌ సెక్టార్‌లోని సంస్థలకూ ఆదేశాలివ్వాలని చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -