నవతెలంగాణ-హైదరాబాద్ : నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతోంది. మొంథా తుఫాన్ ఎఫెక్ట్ బలంగా పడింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. అందులోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. పై నుంచి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భాదరీగా వరద నీరు, వర్షపునీరు రావడంతో సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులో 20 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 16 గేట్లు 10 అడుగులు, 04 గేట్లు 5 అడుగుల వరకు పైకెత్తి 2,72,608 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం కూడా 590 అడుగులు ఉండటంతో అధికారులు కిందకు నీటిని విడుదల చేస్తున్నారు.
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టిఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో & అవుట్ ఫ్లో కలిపి 3,06,062 క్యూసెక్కులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కాలువల్లో భారీగా వరదనీళ్లు కిందకు వెళ్తుండటంతో వాగుల్లో ఉన్న వారందరూ బయటకు రావాలంటూ హెచ్చరిస్తున్నారు. పశువుల కాపరులు, జాలరులు ఎవరైనా కాలువల వెంబడి ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు అధికారులు.



