Thursday, September 25, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునిందితుల ప్రాసిక్యూషన్‌కు ఓకే

నిందితుల ప్రాసిక్యూషన్‌కు ఓకే

- Advertisement -

– రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌
– అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిలపై న్యాయపరమైన చర్యకు ఏసీబీ రంగం సిద్ధం
– గవర్నర్‌ అనుమతించాకే కేటీఆర్‌ వంతు
– ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో కీలక పరిణామం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో హెచ్‌ఎండీఏ మాజీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ప్రస్తుత సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిలను ప్రాసిక్యూట్‌ చేయటానికి ఏసీబీకి ప్రభుత్వం అనుమతిని ఇస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, అప్పటి మున్సిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రాసిక్యూట్‌ చేయటానికి గవర్నర్‌ అనుమతి కోసం ఏసీబీ ఎదురు చూస్తున్నది.

బీఆర్‌ఎస్‌ హయాంలో ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌కు సంబంధించి విదేశీ కంపెనీ ఎఫ్‌ఈఓకు రూ.55 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారనే ఆరోపణలను కేటీఆర్‌, అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఏసీబీ అధికారులు ఇప్పటికే పైముగ్గురిని క్షుణ్ణంగా విచారించారు. అంతేగాక ఒకపక్క క్యాబినేట్‌ అనుమతి లేకుండా, మరోపక్క ఆర్బీఐ నుంచి కూడా అనుమతిని పొందకుండా కార్‌ రేసింగ్‌ నిర్వహణ కోసం భారీ మొత్తంలో డబ్బులను విదేశీ మారక ద్రవ్యం రూపంలో ఎఫ్‌ఈఓ కంపెనీకి బదలాయింపు చేసినట్టు ఏసీబీ తన దర్యాప్తులో తేల్చింది. ఈ కేసులో నిందితులైన పై ముగ్గురిని ప్రాసిక్యూట్‌ చేయటానికి అనుమతినివ్వాలంటూ ఏసీబీ.. విజిలెన్స్‌ కమిషన్‌కు నివేదికను కూడా పంపించింది. దీనిపై క్షుణ్ణంగా పరిశీలన జరిపిన విజిలెన్స్‌ కమిషన్‌.. వీరిని ప్రాసిక్యూట్‌ చేయటానికి అనుమతివ్వాల్సిందిగా సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి ఫైల్‌ను పంపించింది. కాగా కేటీఆర్‌ ప్రజాప్రతినిధి కావటం వల్ల ఆయనను ప్రాసిక్యూట్‌ చేయటానికి అనుమతి కోసం గవర్నర్‌కు ఫైల్‌ను పంపించిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిలను ప్రాసిక్యూట్‌ చేయటానికి అవసరమైన అనుమతిని ఏసీబీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టులో ఈ కేసుకు సంబంధించి అవసరమైన చార్షిషీట్‌ను ఏసీబీ అధికారులు త్వరలో దాఖలు చేయనున్నట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -