– అస్తవ్యస్తంగా పారిశుధ్యం
– కొలువుదీరిన పాలకులు
– ఎదురుగా సవాళ్లు
నవతెలంగాణ – అశ్వారావుపేట : కొత్తగా కొలువుదీరిన సర్పంచ్ లకు అభివృద్ధి కంటే ముందుగా పాత అప్పులు, పెండింగ్ సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. తెలంగాణ రెండో సాదారణ స్థానిక ఎన్నికలు–2025లో భాగంగా సోమవారం అశ్వారావుపేట మండలంలో 27 మంది సర్పంచ్ లకు గాను ఒక్కరు మినహా 26 మంది ప్రమాణ స్వీకారం చేశారు.అయితే బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు వీరిని చుట్టుముట్టాయి.
గత పాలకవర్గాల కాలం ముగిసిన తర్వాత 2023 ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడంతో ప్రతి గ్రామ పంచాయతీలో లక్షలాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి.అనేక బిల్లులు పెండింగ్ లోనే మిగిలిపోయాయి. రోజువారీ చెత్త సేకరణ నత్తనడకన సాగడంతో గ్రామాల్లో పారిశుధ్యం దారుణంగా తయారైంది. చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుండగా, దోమల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
డీజిల్ కు సైతం నగదు లేకపోవడం,మరమ్మతుల కొరతతో చెత్త సేకరణ ట్రాక్టర్లు కొన్ని పంచాయతీల్లో మూలన పడ్డాయి. కొన్ని చోట్ల ట్రాక్టర్ల నెలవారీ కిస్తీ లు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.సిబ్బంది వేతనాల బకాయిలు కూడా సమస్యగానే ఉన్నాయి. గ్రామాల్లో వీధి దీపాలు నెలల తరబడి వెలగని పరిస్థితి కనిపిస్తోంది.
మంచినీటి సరఫరా కోసం ఒక్కో పంచాయతీలో ఐదు నుంచి ఆరు వాటర్ ట్యాంకులు ఉన్నా, నిధుల కొరతతో తాత్కాలిక మరమ్మతులతోనే కాలం గడుస్తోంది. వీటి నిర్వహణ, విద్యుత్ బిల్లుల బకాయిలు నూతన పాలకులకు పెద్ద సవాళ్లుగా మారాయి. సరైన సౌకర్యాలు లేకపోవడం, పాలకవర్గం లేకపోవడంతో ఇంటి పన్నుల వసూళ్లు తగ్గిపోయి ఆదాయం క్షీణించింది.
గత రెండేళ్లుగా పాలకవర్గాలు లేని కారణంగా 15వ ఆర్థిక కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. ఫలితంగా వంద రూపాయల పనికైనా నిధులు లేని నిస్సహాయ స్థితిలో పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కో పంచాయతీకి కనీసం రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రావాల్సిన నిధులు ఎప్పుడు విడుదలవుతాయో స్పష్టత లేదు.
నిధులు వచ్చినా అవి పాత బకాయిలకే సరిపోతాయేమోనన్న ఆందోళన నూతన సర్పంచ్‌లలో వ్యక్తమవుతోంది. లక్షలు ఖర్చు చేసి, ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన సర్పంచ్‌లకు ఇవన్నీ పెను సవాళ్లుగా మారాయి. మొత్తంగా సమస్యల తోరణాల మధ్య అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం జరిగినా, హామీల అమలు, అభివృద్ధి దిశగా అడుగులు పడేది ఎప్పుడు అన్నది మున్ముందు వేచి చూడాల్సిన అంశమే.



