నవతెలంగాణ కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శంకరంపల్లి స్టేజి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…శంకరంపల్లి గ్రామానికి చెందిన బోనగిరి లింగయ్య(65) అనే రైతు రోజులాగే సోమవారం తన చేను వద్దకు వెళ్లాడు. అక్కడ నుంచి తన ఎలక్ట్రికల్ స్కూటీపై ఇంటికి పత్తి సంచులు తీసుకువస్తున్న క్రమంలో కాటారం వైపు నుండి మంథని వైపు వెళుతున్న కారు స్కూటీని వెనుకవైపు నుంచి వేగంగా ఢీకొని వెళ్లిపోయింది.

దీంతో లింగయ్య ఒక్కసారిగా కింద పడిపోవడంతో వాహనదారులు గమనించి ఆయన బంధువులకు సమాచారం అందించారు. బంధువులు హుటాహుటిన వరంగల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ లింగయ్య ఆసుపత్రిలో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

                                    

