నవతెలంగాణ-హైదరాబాద్: ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ దేశాలు కలిసి ఇరాన్‌పై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ప్రతిదాడులకు దిగిన ఇరాన్..యూఎస్-ఇజ్రాయిల్‌లపై డ్రోన్లు, బాంబులతో విరుచుకుపడింది. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులతో విధ్వంసం సృష్టించింది. ఉద్రిక్తల కారణంగా చమురు ఎగుమతులకు కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. రోజురోజుకు పశ్చిమాసియా యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. మరోవైపు హర్మూజ్ గుండా చమురు నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ఆయా దేశాల్లో ఇంధన సంక్షోభం నెలకొంది. ఈక్రమంలోనే ఒమన్ దేశం ఇరాన్‌తో కీలక చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. హర్మూజ్ జలసంధిని తెరిచే విధంగా చర్చలు సాగుతున్నట్లు వెల్లడించింది. ఈమేరకు ఎక్స్ వేదికగా ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
“ఒమన్ సుల్తానేట్-ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల ఉప మంత్రుల స్థాయిలో సమావేశం జరగిందని, ఈ సమావేశానికి ఇరుపక్షాల నుండి నిపుణులు హాజరయ్యారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మధ్య హర్ముజ్ జలసంధి గుండా రవాణా సజావుగా సాగేలా చూసేందుకు గల సాధ్యమైన మార్గాలపై ఈ సమావేశంలో చర్చించం’’ అని పేర్కొంది.



