నవతెలంగాణ-హైదరాబాద్ : డాక్టర్ కె.దివాకరాచారి ‘ఓమారు వెనక్కి వెళ్ళిరావాలి’ కవితా సంపుటిని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ ఆవిష్కరించారు. రవీంద్ర భారతిలో ఆదివారం ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు నందిని సిధారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నిఖిలేశ్వర్ మాట్లాడుతూ ఓమారు వెనక్కి వెళ్ళి రావాలి కవితా సంపుటిలో తన జీవితంలోని అంతర్దృష్టి ఉండటం వలన నోష్టాలజిగానే కాకుండా అనేక విషయాలు తెలుస్తాయన్నారు.
అనుభవాల సాంద్రతను కలిగిన కవిత్వం దివాకరాచారి రాశారని తెలిపారు. ఎనభై కవితల సమాహారం ఈ పుస్తకం. వస్తు విస్తృతి వున్న కవిత్వమిది. అనేకానేక అంశాలు ఈ కవితలకు ఇతివృత్తాలు, గాఢత, సాంద్రతతో అలరారే కవితలు. మన వర్తమాన కాలపు సంక్షుభిత స్థితికి కవి స్పందనలు ఇవి అని తెలిపారు. అధ్యక్షత వహించిన సిధారెడ్డి మాట్లాడుతూ దివాకరాచారి కవిత్వం సామాజిక నేపథ్యం నుంచి వచ్చిందన్నారు. అందుకు ఈ కవితా సంపుటి ఒక నిదర్శనం అని అన్నారు. కవి యాకూబ్ మాట్లాడుతూ గాజా దుఃఖం తెరల నుంచి ఇక్కడి రైతు కష్టాల వరకు అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. దివాకరాచారి కవిత్వం చలనం ఉందని అది సమాజాన్ని తట్టి లేపుతుందన్నారు. ఈ దేశ లౌకిక స్వప్నాలని చిదిమేసే మతోన్మాద రాజకీయాలపై వ్యతిరేకత వుంది. మనుషులలో వెల్లివిరిసే మానవతా ఛాయలున్నాయని తెలిపారు.
ఈ సభలో వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్, ప్రముఖ కవి యాకూబ్, ప్రముఖ విమర్శకురాలు పి.జ్యోతి, ప్రముఖ కవి నాళేశ్వరం శంకరం, ఆనంద్ ప్రసంగించారు. ఈ సభలో కవులు, రచయితలు దివాకరాచారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.