Tuesday, April 29, 2025
Homeరాష్ట్రీయంఒక్కో అడుగు ముందుకు

ఒక్కో అడుగు ముందుకు

ఎన్డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా వ్యూహం
– ఘోష్‌ కమిషన్‌ రిపోర్టు కోసం ఎదురుచూపులు
– బీఆర్‌ఎస్‌ నేతలపై త్వరలోనే కొరడా ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కుంగుబాటు వ్యవహారంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సర్కారు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నది. ఇటీవల ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక రావడం, అందులో గత బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సర్కారు తప్పిదాలను ఎత్తిచూపడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉత్సాహం పెరిగింది. కాళేశ్వరం వాస్తవాల ఆధారంగా బీఆర్‌ఎస్‌ను ప్రజల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వలేకపోయారనీ, కనీసం ఇంకా రూ. 42 వేల కోట్లు వ్యయం చేస్తే తప్ప ప్రాజెక్టు పూర్తయినట్టు కాదని ‘కాగ్‌’ నివేదిక రెండేండ్ల కిందే చెప్పింది. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు బీఆర్‌ఎస్‌కు శాపంగా పరిణమించింది. ఈ ప్రాజెక్టు వినియోగంలోకి రాదని ఎన్డీఎస్‌ఏ సైతం స్పష్టం చేసింది. ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించినా, ప్రాజెక్టు వరదలను తట్టుకుంటుందనే గ్యారంటీలేదని పేర్కొంది. ఈనేపథ్యంలో రేవంత్‌ సర్కారులో ఆత్మవిశ్వాసం పెరుగుతున్నది.ఘోష్‌ నివేదిక కోసం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలనే తలంపు ఇటు సీఎం రేవంత్‌తోపాటు ఏఐసీసీ పెద్దల్లోనూ ఉన్నట్టు కనిపిస్తున్నది. అల్లాటప్పా ఆరోపణలు, విమర్శలతో కేసులు పెట్టి తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన కేసీఆర్‌ను అరెస్ట్‌ చేస్తే పరువుపోవడం మినహా ఫలితం ఉండదని గాంధీభవన్‌ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గాలికి కేసీఆర్‌ బృందంపై చర్యలు తీసుకునే ఆలోచన లేదని సీఎం రేవంత్‌ సోమవారం మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి పక్కా సాక్ష్యాధారాలతో కేసుపెడితే నిలిచేలా ప్రత్యేక వ్యూహాన్ని ఆచరించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చురుగ్గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
తప్పిదాలను ఎత్తిచూపుతూ..
నీటిపారుదల రంగంలో బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో జరిగిన తప్పులను ఎప్పటికప్పుడు మీడియాకు చెప్పడంలో మంత్రి ఉత్తమ్‌ చొరవ చూపిస్తున్నారు. అలాగే మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, సీతక్క తదితరులు సైతం కేసీఆర్‌, హరీశ్‌రావును టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. సాగునీటి పారుదల శాఖలో నియామకాలు ఇష్టారాజ్యంగా చేశారనీ, మాట వినేవారికే ఉన్నతస్థాయి పోస్టులు కట్టబెట్టి తాము చెప్పిందే వేదంలా అమలుచేశారనే ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. ఎవరైనా అధికారి తోకజాడిస్తే వెంటనే పోస్టుల నుంచి తప్పించడం, అప్రాధాన్యత బాధ్యతల్లో పెట్టడం చేశారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఆయా పోస్టుల్లో రిటైరైనా ఒకటికి నాలుగుసార్లు ఎక్స్‌టెన్షన్లు ఇచ్చి పరిపాలన సాగించారని మంత్రులు తరచూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మాజీ ఈఎన్సీ మురళీధర్‌ ఇంజినీరింగ్‌ నియమాల ప్రకారం కాకుండా మాజీ సీఎం కేసీఆర్‌ అభిష్టం మేరకు ప్రాజెక్టు డిజైన్లు రూపొందించారనీ, ఇందులో కింది స్థాయి అధికారులతోపాటు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ పాత్ర కూడా ఉందని నీటిపారుదల శాఖ ఫైళ్లు చెబుతున్నాయి. ఈ విషయాలను విజిలెన్స్‌తోపాటు ఎన్డీఎస్‌ఏ ధృవీకరించాయి.
జస్టిస్‌ ఘోష్‌ విచారణ సందర్భంగా కూడా మాజీ సీఎం కేసీఆర్‌ సూచన మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము డిజైన్లు, డ్రాయింగ్‌లు, ఇతర వ్యవహారాలు చేసినట్టు వాంగ్మూలం ఇచ్చే క్రమంలో చెప్పారు. అడ్డగోలు డిజైన్లతోపాటు ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సైతం మార్చారని ఘోష్‌ కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్లల్లో పేర్కొన్నారు. ఇందులో సీఎంవో స్థాయి అధికారాలు, నీటిపారుదల శాఖలోని ముఖ్య అధికారుల పాత్ర సైతం ఉందని సమాచారం.ఏసీబీ కేసు తాజాగా ఎన్డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా ఏసీబీ సైతం చురుగ్గా చర్యలు చేపడుతున్నది.
ఈఎన్సీ హరిరాంపై కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అందులో భాగమే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థల నుంచి అడ్డగోలుగా నిధులు లంచాల రూపంలో పుచ్చుకున్నారనే ఆరోపణలు, విమర్శలు గతం నుంచే ఉన్నాయి. హరిరాం దాదాపు రూ. 200 కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టారని ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి. మూడు బ్యారేజీలు వినియోగించలేమని ఎన్డీఎస్‌ఏ స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో ఆ నివేదికలోని అంశాలను మంగళవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మీడియాకు చెప్పనున్నారు. తద్వారా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలనే భావనతో సీఎం రేవంత్‌ ఉన్నట్టు గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా కాంగ్రెస్‌ సర్కారు వ్యూహానికి చెక్‌ పెట్టేందుకు రజతోత్సవ వేడుకల పేరుతో వరంగల్‌ సభను కేసీఆర్‌ తలపెట్టినట్టు తెలిసింది. ఉద్యమంలో తాను ఒక్కడినే బయలుదేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టానని సభలో కేసీఆర్‌ చెప్పారు. పాత విషయాలను తవ్వడం ద్వారా తానేంటో ప్రజలకు, ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img