– అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు తీవ్ర వివాదాస్పదమవుతున్నది. ఆయన చెప్పే మాటలకు.. చేసే చేష్టలకు సంబంధం ఉండటం లేదు. తాను అధ్యక్షుడినైతే.. యుద్ధాలను ఆపుతానని, ‘తెలివి తక్కువ యుద్ధాల’ నుంచి అమెరికాను దూరంగా ఉంచుతాననీ, విదేశాల్లో ఉన్న యూఎస్ బలగాలను వెనక్కి రప్పిస్తానని 2016, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లో ట్రంప్ చెప్పాడు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్‌ల మధ్య చోటు చేసుకున్న యుద్ధాన్నీ తానే ఆపానని, శాంతిని నెలకొల్పానని కూడా చెప్పాడు. ఆయన అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయ్యాడు కానీ.. ఆయన చెప్పిన మాటలే కార్యరూపం దాల్చటం లేదు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపుతానని చెప్పిన ఆయన.. ఆ విషయంలో ఎలాంటి మార్పునూ తీసుకురాలేకపోయారు. ఇటు పాలస్తీనాపై ఇజ్రాయిల్ భీకర దాడులు అలాగే కొనసాగాయి. తాజాగా, గత పది రోజుల నుంచి ఇరాన్‌పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. భయంకరమైన దాడులను సాగిస్తున్నది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్‌ను అమెరికానే వెనకుండి నడిపించిందన్నది అంతర్జాతీయ అంశా లపై అవగాహన ఉన్న నిపుణులు చెప్తున్నారు. మొన్నటి వరకు ఇరాన్‌పై దాడి చేయబోమన్న ఆయన.. తాజాగా ఉన్నట్టుండి ఇరాన్‌లోని అణుకేంద్రాలే టార్గెట్‌గా దాడులు జరిపారు. శనివారం సాయంత్రం వైట్‌హౌజ్ నుంచి దేశాన్ని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ దాడులు మూడు కీలకమైన ఇరానియన్ ఎన్రిచ్మెంట్ కేంద్రాలను ధ్వంసం చేశాయన్నారు. అమెరికాను తెలివి తక్కువ యుద్ధాలకు దూరంగా ఉంచుతానని గతంలో ప్రతిజ్ఞ చేసిన ట్రంప్.. తన ముందు దేశాన్ని పాలించిన అధ్యక్షులను తక్కువ చేసి చూపించారు. వారి కంటే తాను భిన్నమనే ప్రచారాన్ని చేసుకున్నాడు. అలాగే, యూఎస్‌ను, మధ్య పాచ్యంను మరో విస్తృత సంఘర్షణ నుంచి దూరంగా ఉంచాలని తాను నిశ్చయించుకున్నానని ట్రంప్ పదే పదే చెప్పాడు. ” ఇరాన్‌కు శాంతి లేదా విషాదం ఉంటుంది. శాంతి త్వరగా రాకపోతే, మేము ఆ ‘ఇతర లక్ష్యాలను’ వెంబడిస్తాం” అని అన్నాడు. ట్రంప్ చర్యపై స్వదేశంలో, అది కూడా అమెరికా చట్టసభ సభ్యుల నుంచి ఆందోళన వ్యక్తమైంది.
ఆయన.. తన అధికారానికి మించి వ్యవహరించారని భావించారు. ఇది రాజ్యాంగబద్ధం కాదంటూ ఎక్స్ వేదికగా కొందరు స్పందించారు. కాంగ్రెస్ అనుమతి లేకుండానే ట్రంప్.. ఇరాన్‌పై చర్యకు దిగారని మరొకరు వివరించారు. ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయిల్, యూఎస్ స్థావరాలను రక్షించటానికి అమెరికా ఇటీవలి రోజుల్లో సైనిక విమానాలను, యుద్ధ నౌకలను మధ్యప్రాచ్యంలోకి, చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తోంది. ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించుకున్న ఏడేండ్ల తర్వాత ఈ సైనిక ఘర్షణ జరగటం గమనార్హం.
చెప్పేదొకటి.. చేసేదొకటి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES