Sunday, May 4, 2025
Homeజాతీయంఅప్పుడలా..ఇప్పుడిలా

అప్పుడలా..ఇప్పుడిలా

- Advertisement -

– ముంబయి ఉగ్రదాడిపై ఒకలా.. పహల్గాంపై ఇంకోలా..
– అప్పట్లో గుజరాత్‌ సీఎంగా యూపీఏ సర్కారుపై ఆరోపణలు
– ప్రధాని మన్మోన్‌సింగ్‌ ప్రసంగంపై విమర్శలు
– అందరు సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌
– ప్రస్తుతం అందుకు విరుద్ధంగా మోడీ వైఖరి
న్యూఢిల్లీ:
భారత్‌లో జరిగిన ఉగ్రదాడులపై పలు సందర్భాల్లో మోడీ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారుతున్నది. 2008లో దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఉగ్రదాడి.. ప్రస్తుతం పహల్గాం ఘటన.. ఈ రెండింటి విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. నవంబర్‌ 26, 2008న జరిగిన భయంకరమైన ఉగ్రదాడి సమయంలో మోడీ గుజరాత్‌ సీఎంగా ఉన్నారు. ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఈ ఉగ్రదాడి తర్వాత మోడీ అప్పటి యూపీఏ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. వారి పాలనలో దేశ భద్రత ప్రమాదంలో ఉన్నదని ఆరోపించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ ప్రసంగంపై నిరాశను వ్యక్తం చేశారు. ఆ సమయంలో రాజస్థాన్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా మోడీ, ఆయన పార్టీ బీజేపీ వ్యవహరించిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. నాడు 2008లో ముంబయిపై ఉగ్రదాడితో దేశమంతా తీవ్ర భయాందోళనలో, షాకింగ్‌లో ఉన్న సమయమది. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా అండగా ఉంటామంటూ భారత ప్రభుత్వానికి ధైర్యాన్ని ఇవ్వాల్సిందిపోయి.. మోడీ ప్రశ్నలు, విమర్శలు, ఆరోపణలు సంధించారు. ఇది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు దేశ ప్రధానిగా పహల్గాం విషయంలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మోడీ అనుసరిస్తున్న తీరును రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు పోల్చి చూస్తున్నారు. ఆ సమయంలో మోడీ చెప్పిన మాటలకు, ప్రస్తుత ఉగ్రదాడి విషయంలో ఆయన చేస్తున్న చేష్టలకు సంబంధమే లేదని అంటున్నారు.
ముంబయిలో ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల తర్వాత ముంబయి నగరానికి మోడీ చేరుకున్నారు. దాడి జరిగిన ప్రదేశాల్లో ఒకటైన ఒబేరారు ట్రైడెంట్‌ హోటల్‌కు వచ్చారు. ఆ సమయంలో దేశ భద్రతా బలగాలు ఒకపక్క ముష్కరులతో పోరాడుతుండగానే.. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులను ఉద్దేశిస్తూ మోడీ ప్రసంగించటం గమనార్హం. ఒకరోజు ముందు మన్మోహన్‌సింగ్‌ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం చాలా నిరాశపర్చిందనీ, ప్రధానిగా అది అంచనాలను అందుకోలేకపోయిందని విమర్శించారు. దేశ అంతర్గత భద్రతపై చర్చించటానికి ముఖ్యమంత్రులందరితోనూ సమావేశం ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానిని ఆయన కోరారు. ఒక పక్క ఉగ్రవాదులతో భారత భద్రతా దళాలు పోరాడుతున్న సమయంలోనే దేశ ప్రధానిని విమర్శిస్తూ మోడీ ప్రసంగం చేశారు. కాగా, మోడీ పర్యటనకు ఒకరోజు ముందే ఉగ్రదాడిని భారత్‌పై పూర్తిస్థాయి యుద్ధమంటూ ఆయన పార్టీ బీజేపీ అభివర్ణించింది. యూపీఏ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఆ తర్వాతి రోజే మోడీ నుంచి ఇలాంటి మాటలు వినబడటం గమనార్హం.
ఢిల్లీ, రాజస్థాన్‌ ఎన్నికలే లక్ష్యంగా…
అదే ఏడాది నవంబర్‌ 9, డిసెంబర్‌ 4 రోజులలో ఢిల్లీ, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సి ఉన్నాయి. భారత ప్రభుత్వానికి అండగా ఉంటామని అప్పటి వరకు చెప్పిన బీజేపీ 48 గంటల వ్యవధిలోనే ఆ మాటలకు విరుద్ధంగా వ్యవహరించింది. ఢిల్లీ, రాజస్థాన్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ సమయంలో జాతీయ వార్త పత్రికలలో ఉగ్రదాడికి సూచకంగా ఎర్రటి రంగులో పూర్తి పేజీ ప్రకటనలను ప్రచురించింది. యూపీఏ పాలనలో జరిగిన ముంబయి ఉగ్రదాడిని హైలెట్‌ చేసింది. బలహీనమైన, అసమర్థ ప్రభుత్వంగా అభివర్ణించింది. ఉగ్రవాదంపై పోరాడాలనీ, బీజేపీకి ఓటు వేయాలని బీజేపీ ఇచ్చిన ఆ ప్రకటనలో ఉన్నది. పార్లమెంటులో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ.. ఉగ్రదాడి జరిగిన మూడ్రోజులకే వార్తపత్రికల్లో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని, ఎన్నికలే టార్గెట్‌గా ప్రకటనలు ఇచ్చిన విషయాన్ని తప్పుబడుతూ రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు.
ఒకపక్క అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు, ఉగ్రవాదంతో పోరాడుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని కోరినందుకు మోడీపై కానీ, ఆయన పార్టీ బీజేపీ మీద కానీ ఎలాంటి కేసూ నమోదు కాలేదు.
అఖిలపక్ష సమావేశానికి దూరం..
ఉగ్రదాడి ఏదైనా.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా కథనాలు

యూపీఏ పాలనలో జరిగిన దాడులను అప్పటి ప్రభుత్వ వైఫల్యంగా విమర్శించారు. అదలా ఉంచితే, ఎన్డీఏ హయాంలో జరిగే ఉగ్రవాద దాడులనూ కాంగ్రెస్‌కే ఆపాదిస్తుండటం వైచిత్రి! ఇది మోడీ సర్కారుకే చెల్లిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విషయాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కథనాలను ప్రచారం చేసి, ప్రజల మానసిక స్థితిని ప్రభావితం చేయటంలో బీజేపీ విజయం సాధించిందని అంటున్నారు. ఉగ్రదాడుల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన బలమైన విజయాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు అని వివరిస్తున్నారు.
ప్రశ్నిస్తున్నవారిపై కేసులు
కేంద్రంలోని మోడీ సర్కారు తీరునూ ప్రజలూ గమనిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలనూ పంచుకుంటున్నారు. ఒకపక్క దేశ రాజధానిలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంటే.. మోడీ బీహార్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక పహల్గాంలో భద్రతా, నిఘా వైఫల్యం విషయంలో మోడీ సర్కారును విమర్శిస్తున్నవారిపై బీజేపీ పాలిత రాష్ట్రాలలో కేసులు నమోదవుతున్నాయి. ఇందులో జర్నలిస్టులు, డాక్టర్లు, టీచర్ల వంటివారున్నారు. పలు యూట్యూబ్‌ ఛానెళ్ల పైనా చర్యలు తీసుకుంటున్నారు. అయితే, పౌర స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను అణచివేస్తున్న మోడీ సర్కారు, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల తీరును మేధావులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
పార్లమెంటు సమావేశాలపై మౌనం
దాదాపు 17 ఏండ్ల తర్వాత ఇప్పుడు పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ముంబయి టెర్రర్‌ ఎటాక్‌ తర్వాత పౌరులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. తమ పాలనలో దేశ రక్షణ వ్యవస్థ, భద్రత పూర్తిస్థాయిలో పటిష్టంగా ఉంటుందని చెప్పుకునే మోడీ.. ఆయన ప్రధాని కుర్చీలో ఉండగానే ఈ దాడి జరిగిందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఈ విషయంలో నిఘా, భద్రతా వైఫల్యం పూర్తిగా కనిపిస్తున్నా.. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరిస్తూ.. ఈ గంభీరమైన సమయంలో కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నాయని చెప్తున్నారు. అయితే, ప్రధానిగా ఉన్న మోడీ.. గతంలో తాను చెప్పిన మాటలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. పహల్గాం దాడి తర్వాత న్యూఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరు కాలేదు. ఉగ్రదాడితో తీవ్ర శోకసంద్రంలో ఉన్న దేశాన్ని ఉద్దేశించి ప్రజలలో ధైర్యం కలిగేలా కూడా ప్రభుత్వ పరంగా మోడీ ప్రసంగించలేదు. అయితే, బీహార్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. ఉగ్రదాడి మృతుల పట్ల మౌనం పాటించి, ఉగ్రవాదులను ఏరివేస్తామని ఉపన్యసించటం గమనార్హం. ముంబయి ఉగ్రదాడిపై ఆ సమయంలో అందరు సీఎంలతో సమావేశానికి డిమాండ్‌ చేసిన మోడీ.. పహల్గాందాడిపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్షాల అభ్యర్థనపై మాత్రం మౌనం వహించటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -