Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅదానీ, అంబానీ కోసమే 'ఆపరేషన్‌ కగార్‌'

అదానీ, అంబానీ కోసమే ‘ఆపరేషన్‌ కగార్‌’

- Advertisement -

– నయా ఫాసిస్టు ధోరణులు వలంబిస్తోన్న కేంద్రం ఆరు గ్యారంటీ అమలు హామీ ఏమైంది? : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-సంగారెడ్డి

ఆపరేషన్‌ కగార్‌ అదానీ, అంబానీ కోసమేనని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నయా ఫాసిస్టు ధోరణులను అవలంబిస్తుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయం కేవల్‌ కిషన్‌ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ, ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు అప్పజెప్పాలనే దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ను చేపట్టిందన్నారు. మావోయిస్టుల పేర ఆదివాసులను చంపడం దుర్మార్గమని, వెంటనే ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మావోయిస్టు సమస్య రాజకీయ సమస్య అని, దీన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానివి డైవర్ట్‌ రాజకీయాలు
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనవసరమైన చర్చలు పెట్టి ప్రజా సమస్యలను డైవర్ట్‌ చేస్తున్నదని, ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం చేయాల్సిన పనిని చేయాలని డిమాండ్‌ చేయకుండా ఈ చర్చల్లో భాగం పంచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. జహీరాబాద్‌ నిమ్జ్‌ భూములు, సంగారెడ్డి త్రిబుల్‌ ఆర్‌ పేరుతో పేదల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. భూములు కోల్పోతున్న రైతులకు 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏండ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్ల రద్దు కోసం జులై 9న చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, పార్టీ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. మల్లేశ్‌, ఎ. మాణిక్‌, కె. రాజయ్య, బి.సాయిలు, బి. రామచందర్‌, ఎం. నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad