నవతెలంగాణ-హైదరాబాద్: కేరళలో ప్రతిపక్షం వాస్తవాలను ప్రస్తావించి విమర్శించలేకపోవడంతో అబద్ధాల ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సరైన విమర్శలు చేయడంలో ప్రతిపక్షం విఫలమైందని అన్నారు. చార్జిషీట్ ప్రవేశపెట్టే పద్ధతిలోనే అవిశ్వాస తీర్మానం ద్వారా విమర్శలు చేయాల్సిన ప్రతిపక్షం అలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని విమర్శించారు. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్(కెఐఐఎఫ్బీ) ద్వారా రాష్ట్రంలో భారీ అభివృద్ధి జరిగిందని సీఎం తెలిపారు. కేఐఐఎఫ్బీ ఐదేళ్లలో రూ. 62,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది. అన్ని నియోజకవర్గాల్లోనూ కెఐఐఎఫ్బీకి ప్రాజెక్టులు ఉన్నాయి. కేఐఐఎఫ్బీ రూ. 1,10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టిందని, 50-60 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులను ఈ 10 ఏళ్లలోనే చేపట్టిందని వెల్లడించారు. అద్భుతమైన ఆర్థిక నిర్వహణతో పనిచేసే కేఐఐఎఫ్బీని ప్రతిపక్షాలు కించపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
భారతదేశంలో తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా కేరళ నిలవడానికి లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వమే కారణమని ఆయన పేర్కొన్నారు. అవినీతి విషయంలో రాజీ పడని విధానమే తమ బలం అని స్పష్టం చేశారు. కేరళకు తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం అనే హోదా కాదు, అవినీతి రహిత రాష్ట్రం కావాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల మద్దతు, విశ్వాసం తమకు ఉందని, వామపక్షాలు ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటాయని సీఎం పినరయి విజయన్ తెలిపారు.



