ఓపీఎస్‌ అమలు చేయాల్సిందే…

OPS should be implemented...– సీపీఎస్‌ రద్దు చేసిన రాష్ట్రాలకు పెన్షన్‌ నిధి ఇవ్వని కేంద్రం
– సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ సర్కారు తీరు
– ఎన్‌ఎంఓపీఎస్‌ సెక్రెటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ
– ఢిల్లీలో భారీబహిరంగసభ
నవతెలంగాణ – ఢిల్లీ
దేశవ్యాప్తంగా పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) అమలు చేయాల్సిందేనని నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం (ఎన్‌ఎంఓపీఎస్‌) ఎంప్లాయిస్‌ యూనియన్‌ సెక్రెటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసిన రాష్ట్రాలకు వారి పెన్షన్‌ నిధిని కేంద్ర ప్రభుత్వం ఇవ్వక పోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాంలీల మైదానంలో ఎన్‌ఎంఓపీఎస్‌ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. భారీ సంఖ్యలో సీపీఎస్‌ విధానంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సభకు ఉత్తరప్రదేశ్‌ అధ్యక్షులు విజరు కుమార్‌, పంజాబ్‌ అధ్యక్షులు సుఖ్జీత్‌ సింగ్‌, తెలంగాణ నుంచి సీపీఎస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌, కోశాధికారి నరేష్‌ గౌడ్‌, మహారాష్ట్ర నుంచి విటేష్‌ కండెల్కర్‌, హర్యానా దారివాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రదీప్‌ ఠాకూర్‌, కర్ణాటక నుంచి శాంతారంతోపాటు కేంద్ర, రాష్ట్ర, ఆర్డినెన్స్‌, రైల్వే, అటానమస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కిసాన్‌ సంఘం నేత రాకేశ్‌ టికాయత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంఓపీఎస్‌ సెక్రెటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ కొత్త పెన్షన్‌ విధానమనేది ఇటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు, కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా కేవలం కార్పొరేట్ల సొమ్ము నింపడానికి ఉందని విమర్శించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉద్యోగుల సొమ్ము రూ.తొమ్మిది లక్షల కోట్లు షేర్‌ మార్కెట్‌లో ఉందన్నారు. ఇటీవల సీపీఎస్‌ వల్ల ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులు, అధికారులు కేవలం నెలకు రూ.1,200, రూ.1,800 పెన్షన్‌ పొందుతున్నారని అన్నారు. వారికి దీంతో జీవనోపాధి లేక వారి సామాజిక భద్రతను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల దేశాన్ని రక్షించడానికి అత్యున్నత త్యాగం చేసిన పారా మిలిటరీ బలగాలకు కూడా పాత పెన్షన్‌ విధానాన్ని నిరాకరించడమనేది చాలా దుర్భరనీయమని అన్నారు. ఇటీవల సీపీఎస్‌ను రద్దు చేసిన రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో ఉద్యోగులు, ప్రభుత్వాల కాంట్రిబ్యూషన్‌ దాదాపు 2004 నుంచి జమ అయ్యిందని వివరించారు. రాజస్థాన్‌లో రూ.39 వేల కోట్లు, ఛత్తీస్‌ఘడ్‌లో రూ.18 వేల కోట్లు, జార్ఖండ్‌లో రూ.12 వేల కోట్లు, హిమాచల్‌ ప్రదేశ్‌లో రూ.9 వేల కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర ప్రభుత్వం, పీఎఫ్‌ఆర్డీఏ ప్రత్యేక చొరవ తీసుకుని వారి సొమ్మును ఆయా రాష్ట్రాలకు తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏ రాష్ట్రం అయితే పీఎఫ్‌ఆర్డీఏ నుంచి వెళ్లిపోవాలనుకుంటుందో వాటికి ఆ అవకాశాన్ని ఇచ్చి రాష్ట్రాల స్వేచ్ఛను కాపాడుతూ సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించి రాష్ట్రాలను ఇబ్బందులకు గురిచేయొద్దని డిమాండ్‌ చేశారు.
పాత పెన్షన్‌ ఆందోళనకు సంపూర్ణ మద్దతు : రాకేశ్‌ టికాయత్‌
రైతు బిడ్డలుగా ఉన్న ఉద్యోగులు చేస్తున్న ఈ పెన్షన్‌ ఆందోళనకు కిసాన్‌ సంఘం నేత రాకేశ్‌ టికాయత్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ విధానం పట్ల ఉద్యోగులు పడుతున్న బాధల గురించి వివరిస్తానన్నారు. ఈ సభలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ‘సీపీఎస్‌ రద్దు చేయని రాష్ట్రాల్లో ఓట్‌ ఫర్‌ ఓపీఎస్‌ కొనసాగించాలి’అని ప్రతిజ్ఞ చేశారు.

Spread the love