– డిసెంబర్‌లో మీటింగ్ పెట్టండి..మళ్లీ వస్తా
– మీకు కావాల్సిన నిధులు మంజూరు చేస్తా
– యూనివర్సిటీ అభివృద్ధిని అడ్డుకునే వారిని ఓడించండి
– బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఓయూను బతకనివ్వదు
– 15 రోజుల్లో కోదండరామ్‌కు మళ్లీ ఎమ్మెల్సీ : ఓయూలో వివిధ శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం విశ్వవిద్యాలయంలో రూ.90 కోట్లతో నిర్మించిన దుందుభి, బీమా వసతి భవనాలను ప్రారంభించిన ఆయన అనంతరం డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్‌లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం తరహాలో సకల వసతులు సమకూర్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకోసం యూనివర్సిటీకి చెందిన పలువురు సభ్యులుగా నిపుణుల కమిటీని వేయాలని సూచించారు. అభివృద్ధికి కావాల్సిన నిధులు సమకూర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ”తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివి. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు ఈ యూనివర్సిటీ విద్యార్థులే. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి ఇక్కడ చదువుకున్న వారే. తెలంగాణ నలుమూలలా ఏ సమస్య వచ్చినా మొదట చర్చ జరిగేది ఈ యూనివర్సిటీలోనే. చదువుతోపాటు పోరాటాన్ని నేర్పించే గడ్డ ఇది. కొంతమంది రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఈ విశ్వవిద్యాలయం ముందుకు తీసుకెళ్లింది. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఈ యూనివర్సిటీకి చెందిన విద్యార్థే. ఎంతో మంది మేధావులను అందించిన ఘన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ సొంతం” అని సీఎం కొనియాడారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఈ విద్యాలయాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. దీనికి పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రకటించారు. ఆ క్రమంలోనే చదువుకుని చైతన్యం ఉన్న వారిని వీసీలుగా నియమించామని గుర్తు చేశారు. 108 ఏండ్ల చరిత్రలో దళితుడు వైస్ ఛాన్స్‌లర్ కాలేదనీ,. ప్రస్తుతం తమ ప్రభుత్వం దళితుడిని వీసీగా నియమించిందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచే మేధా సంపత్తి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రావాలని ఆకాంక్షించారు.
యువత రాజకీయాల్లోకి రావాలి..
దేశానికి యువ నాయకత్వం అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ”దేశంలో 60 శాతం జనాభా 35 ఏండ్ల లోపు వారే. ఇది మన దేశ సంపద. 21 ఏండ్ల వయసులో ఐఏఎస్‌లు దేశానికి సేవలందిస్తున్నప్పుడు… శాసనసభలో అడుగు పెట్టేందుకు 35 ఏండ్ల వయోపరిమితి ఎందుకు?” అని సీఎం ప్రశ్నించారు. వయోపరిమితిని 21 ఏండ్లకు ఎందుకు తగ్గించకూడదో ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించారు. యూనివర్సిటీలు చదువులకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనలకు వేదిక కావాలని అన్నారు. ”సైద్ధాంతికపరమైన భిన్నాభిప్రాయాలపై చర్చలు జరగాలి. సాంకేతిక పరమైన చర్చలు జరగాలి. వర్సిటీలు, విద్యాలయాల్లో సిద్ధాంతపరమైన పోరాటాలు, సామాజిక చైతన్య ఉద్యమాలు లేని కారణంగా చిన్న చిన్న కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవించడం లాంటి వ్యసనాల బారిన పడుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు” అని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాలయాలు విద్యతో పాటు దేశానికి నాయకత్వం వహించే నిపుణులను తయారు చేయాలని ఆకాంక్షించారు
ఓయూలో పోలీసులు కనిపించొద్దు..
ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు కనిపించొద్దని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ”నిరసన తెలిపే వారిని నిరసన తెలపనివ్వండి. నేను రావొద్దని అడ్డుకునే వారికి సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది. కొంతమంది రాజకీయ నాయకులకు పదవులు పోయాయన్న ఆవేదన ఉంటుంది. వాళ్ల కొడుకులను ఏదో చేద్దామనుకుంటే ఏదో అవుతున్నారని బాధ ఉంటది. వారి ఉచ్చులో మీరు పడొద్దు. సమస్యలుంటే మాకు చెప్పండి. మా మంత్రులు మీకు అందుబాటులో ఉంటారు. డిసెంబర్‌లో ఆర్ట్స్ కాలేజీ వద్ద మీటింగ్ పెట్టండి. మళ్లీ యూనివర్సిటీకి వచ్చి అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేసా.్త” అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
15 రోజుల్లో కోదండరామ్‌కు ఎమ్మెల్సీ…
ప్రొఫెసర్ కోదండరామ్‌పై కుట్ర చేసి సుప్రీంకోర్టుకు వెళ్లి ఆయన ఎమ్మెల్సీ పదవి తొలగించారని సీఎం ఆరోపించారు. మరో 15 రోజుల్లో ఆయన మళ్లీ ఎమ్మెల్సీ అవుతారని సీఎం స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఆయనకు తమ సర్కార్ సముచిత స్థానం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఆయన పదవి పోయిందని కొంతమంది నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. ”అపోహలకు లోను కాకండి. అబద్ధాల సంఘం చెప్పే మాటలు నమ్మొద్దు. వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు, ఏనుగులు ఉన్నాయని ప్రచారం చేసి అడ్డుకున్నారు. తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేనేలేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి. వాళ్లు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు లాంటి వారు. అలాంటివారు మళ్లీ అధికారంలోకి వస్తే ఉస్మానియా యూనివర్సిటీని ఉండనివ్వరు” అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు, యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆక్స్‌ఫర్డ్ తరహాలో ఓయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES