Friday, May 16, 2025
Homeఎడిట్ పేజిసంచిలోంచి…!

సంచిలోంచి…!

- Advertisement -

ది క్యాట్‌ ఈజ్‌ ఔట్‌ ఆఫ్‌ బ్యాగ్‌ (సంచిలోంచి పిల్లి బయటికొచ్చింది). ఇంతదాకా దాచిపెట్టిన రహస్యం బట్టబయలైందని ఈ నానుడికి అర్థం. నిప్పు జేబులో వేసుకుంటే ఏమవుతుందో మనకి తెలియంది కాదు. కాని ప్రభుత్వాలే నిప్పు జేబులో వేసుకుంటే..! అభాసుపాలు కాకతప్పదు. ఈ సందర్భంగా 19వ శతాబ్దం చివర్లో బ్రిటన్‌ ప్రధానిగా పనిచేసిన బెంజిమిన్‌ డిస్రైయిలీకి ప్రఖ్యాత అమెరికన్‌ కథకుడు మార్క్‌ ట్వెయిన్‌ ఆపాదించిన విషయమేమిటంటే ”అబద్ధాలు, ఘోరమైన అబద్ధాలు, గణాంకాలు” అన్నాడని.
ఎందుకంటే డిస్రైయిలీ కన్సర్వేటివ్‌ పార్టీ నాయకుడు. అంటే మితవాదులు గణాంకాలన్నింటినీ సందేహి స్తారని ఆయన భావమై యుండచ్చు. ప్రస్తుత బీజేపీ పాలకుల్ని చూస్తే మార్క్‌ట్వెయిన్‌ ఎంత కరెక్టో అర్థమవుతుంది. వీరు అసలు గణాం కాలను దాచిపెట్టి, తాము వండివార్చిన వాటినే దేశంలో చెలామణీలో పెట్టారు. కోవిడ్‌ మహమ్మారిని తమ ప్రభుత్వం శక్తివంతంగా కట్టడి చేసిందని మోడీ- యోగీ బృందం మన దేశంలో చేయని ప్రచారం లేదు. టీకాలు తయారు చేసి ప్రపంచానికి అందించామని కూడా జబ్బలు చరుచుకున్నారు. ”వాక్చతురులు స్వగతాలపై పట్టు సాధిస్తారు.. ప్రచార మాధ్యమాలపై, మార్కెట్‌పై గుత్తాధిపత్యం సంపాదిస్తారు. గణాంకాలను, అంకెలు, సంఖ్యలను తిమ్మిని బమ్మిని చేయడానికి వాడతారు. వాక్చతురిని శక్తి పదాల్లోనే ఉంటుంది. చేసే వాగ్దానాల్లో ఉంటుంది. నెరవేరుస్తున్నట్టు చేసే ప్రసంగంలో ఉంటుంది. ఏ వాదననైనా నోరుమూయించగల పిలుపునివ్వడంలో ఉంటుంది” అంటాడు బ్రహ్మప్రకాష్‌.
‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ అనే అమెరికా సంస్థ నిర్వహించిన సర్వేలో మోడీ రేటింగ్‌ 76 నుండి 83 శాతానికి పెరిగింది. ఇయాన్స్‌-సీఓటర్‌ అనే మరో సంస్థ నిర్వహించిన సర్వేలో ”మోడీపై విశ్వాసం 2023 మార్చి 25న ఉన్న 76.8 శాతం నుండి ఏప్రిల్‌ 21 నాటికి 93.5 శాతానికి పెరిగింది. ఆయన మునుపెన్నటికన్నా బలవంతుడయ్యాడు. సామాన్య నాయకుని స్థాయి నుండి దైవాంశ సంభూతుడి స్థాయికి చేరుకున్నాడు”. దేశంలో జరిగిన రైతు ఉద్యమం, ఇతర కార్మికోద్యమాల ధాటికి కలికానికి కూడా కానరాకుండా పోవాల్సిన బీజేపీ పోటీ కర్రల పైనైనా నిల బడగలగడానికి కారణం ఈ ‘రేటింగు’లే! ఆ తర్వాత 2024 ఎన్నికల్లో బీజేపీ పంట కోసేసుకుంది.
రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ సెన్సస్‌ కమిషనర్‌ చల్లగా మొన్న విడుదల చేసిన లెక్కలు బీజేపీ ప్రచార బెలూన్‌ను పంక్చర్‌ చేసినాయి. 2015-19 కంటే 2020-21 మరణాలు అనేక రెట్లు ఎక్కువున్నాయి, మోడల్‌ స్టేట్‌గా బీజేపీ ఆకాశానికెత్తిన గుజరాత్‌ పరిస్థితి మరీ దారుణం. 2021లో ఆనాడు ప్రభుత్వం ప్రకటించిన దానికంటే 44 రెట్లు అధిక మరణాలు నమోదైనట్టు ఇపుడు రిజిస్ట్రార్‌ జనరల్‌ ప్రకటించారు. ఆనాడు 1.5 లక్షల మరణాలని బీజేపీ చెప్పుకుంటే నేడు లెక్క 3.8 లక్షలని తేలింది. కోవిడ్‌ మరణాలను సరిగా లెక్కించని రాష్ట్రాల్లో గుజరాత్‌కే అగ్రతాంబూలం. ఆశ్చర్యకరంగా దాని తర్వాతి స్థానం తెలంగాణాదేనని హిందూ పత్రిక మొన్న తన డేటా పాయింట్లో పేర్కొంది. రాష్ట్రాన్ని ఉద్ధరించామని చెప్పుకునే నాయకమ్మన్యులు వీరు.
ఇవన్నీ ఇహలోకానికి సంబంధించిన విషయాలు. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ సెన్సస్‌ వారు ప్రకటించిన వివరాలకి సంబంధించి నేటి మన కేంద్ర పాలకులకు పట్టింపు తక్కువ. ఆ సమయంలో తెల్లటి గడ్డంతో మునీశ్వరుడి అవతారం ఎత్తిన ‘విశ్వగురు’ ఎన్‌డీటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో తనని తాను ‘దేవుని దూత’గానూ, అసలు తాను తల్లి గర్భంలో నుండి పుట్టినవాణ్ణి కాదనియూ చెప్పుకున్నాడు. ‘దేవుని లీల’ అక్కడితో ఆగిపోయింటే బాగుండేది.
గుజరాత్‌ తీరానికి సుమారు 12 వేల కి.మీ. దూరంలో అమెరికాను మరోసారి గొప్పదిగా చేయడానికే దేవుడు తనని ఈ భూమ్మీదికి పంపాడని మరో తెల్లదొర ట్రంప్‌ చెప్పుకున్నాడు. ప్రపంచ పటానికి తూర్పున ఒకరు, పడమటి తీరాన మరొకరు ఆవిర్భవించి ప్రపంచ వెలుగులను ద్విగుణీకృతం చేయడంతో ప్రాక్‌ పశ్చిమాలు ‘ప్రకాశించి’ పోతున్నాయి. ఇరుదేశాల జనం బాధలు అలివిగాకుండా ఉన్నాయి. ముఖ్యంగా భారతీయులు కోవిడ్‌-19 నుండి తాజాగా సరిహద్దుల్లో మోగిన బాంబుల వర్షం వరకు వర్ణనాతీతం. ఇలాంటి ఇహలోక అంశాల్ని జనాలు పట్టించుకోకూడదంటే పరలోక విషయాల చుట్టూ తిప్పాల్సిందే! తిప్పుతోంది అందుకేగా!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -