– సర్కారు అనుమతి లేదన్న రవాణాశాఖ ఉన్నతాధికారులు
– యాజమాన్య సొంత నిర్ణయమంటున్న కార్మిక సంఘాలు
– ఆ ఉత్తర్వులపై సర్వత్రా వ్యతిరేకత
– ఈ వారంలో కార్మికసంఘాలతో సీఎం భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ నియామకాలకు సంబం ధించి యాజమాన్యం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని రవాణాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలిసింది. రెండ్రోజుల్లో వీటిని రద్దు చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ ఉత్తర్వుల రద్దుపై ఇప్పటికే బస్భవన్లోని చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎమ్)కు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ద్వారా 300 మంది కండక్టర్లను రిక్రూట్ చేసుకోవాలని యాజమాన్యం భావించి, గత నెల 8వ తేదీ రీజినల్ మేనేజర్లకు సర్క్యులర్లు పంపిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి దరఖాస్తుల్నీ స్వీకరించలేదని సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అంశంపై ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చే జరిగింది. ఆర్టీసీలోని కార్మిక సంఘాలన్నీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాయి. ఆందోళనలకూ సిద్ధమవుతున్నాయి. ఇటీవలే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో ఆర్టీసీలో ఖాళీల భర్తీ డిమాండ్ కూడా ఉంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 3,035 ఖాళీ పోస్టుల్లో కండక్టర్ పోస్టులు లేవనీ, వాటిని కూడా కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరాయి. దీనికి ఆయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఔట్ సోర్సింగ్ ద్వారా కండక్టర్ నియామకాలు చేపట్టా లని యాజమాన్యం ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీ యాంశమైంది. ఈ అంశంపై రవాణాశాఖ ఉన్నతా ధికారులు ఆర్టీసీ యాజమాన్యాన్ని తప్పుపట్టినట్టు సమాచారం. ప్రభుత్వ అనుమతి లేకుండా, తమకు ఎలాంటి సమాచారం లేకుండా, నియామకాలకు సంబం ధించి ఉత్తర్వులు ఎలా ఇస్తారని ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో వెంటనే ఆ ఉత్తర్వుల్ని రద్దు చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించినట్టు తెలిసింది. మంగళవారం ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలోని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి వద్ద చర్చ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే ఎలక్ట్రిక్ అద్దె బస్సుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఆర్టీసీలకు ఇవ్వాలనే అంశంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి కేంద్ర రవాణాశాఖ మంత్రి కుమారస్వామికి రాసిన లేఖపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు ఈ వారంలోనే ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి ఆర్టీసీ కార్మిక సంఘాలతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై చర్చిస్తారని భావిస్తున్నారు.
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ఉత్తర్వులు రద్దు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES