నవతెలంగాణ-హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్)- (విబి – జి రామ్ జి)గా మారుస్తూ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే అది ఆమోదం కూడా పొందింది. అయితే ఈ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులను కేవలం 36 (అక్టోబర్ 10- నవంబర్ 14) రోజుల్లోనే 16 లక్షలకు పైగా కార్మికుల్ని కేంద్రం తొలగించింది. ఈ విషయాన్ని తాజాగా సమాజ్‌వాది పార్టీ ఎంపీలు లాల్జీ వర్మ, ఆనంద్ భదౌరియా లేవనెత్తిన ప్రశ్నలకు లోక్‌సభలో స్వయానా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ రాతపూర్వక సమాధానమిచ్చారు.
కాగా, వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం కింద తొలగించిన కార్మికుల సంఖ్య ఏపీలో 11,07,339, తెలంగాణ : 95,084, ఒడిశా 80,896, జమ్మూకాశ్మీర్ 79,070, చత్తీస్‌గఢ్ : 65,619, తమిళనాడు 33,090, కర్ణాటక 27,004, కేరళ 20,124, ఉత్తరప్రదేశ్ 17,236, పంజాబ్ 16,898, మహారాష్ట్ర 15,061, రాజస్థాన్ 13,701 ఉపాధిహామీ కార్మికుల్ని తొలగించారు. నకిలీ కార్డులు, కార్మికుల వలసలు, పంచాయతీల పట్టణ పునర్విభజన, మరణాల కారణంగా తొలగింపులు జరిగాయి. అయితే కార్మికుల్ని తొలగించిన రాష్ట్రాల్లో ఏపీ టాప్‌లో ఉంది. ఎన్‌డిఎ మిత్రపక్ష పార్టీ అయిన టిడిపి హయాంలోని ఏపీలో 11 లక్షల మందిని ఈ పథకం నుంచి తొలగించడం గమనార్హం. విబి-జి రామ్ జి అమల్లోకి రాకముందే కేంద్రం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి లక్షలాది మందిని ఉపాధికి దూరం చేసిందనేది ఈ అంకెల్ని చూస్తే స్పష్టమవుతుంది.



