– చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ లిఫ్ట్ సమస్యలను పరిష్కరించాలి
– శాసనసభ సమావేశాల జీరో అవర్ లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ–కమ్మర్ పల్లి
శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం జీరో అవర్ లో బాల్కొండ నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ కు సంబంధించి ప్యాకెజ్ 21, చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ లిఫ్ట్ సమస్యలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సభలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 21ఏ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి గత కేసిఆర్ ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఇదన్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా బాల్కొండ నియోజకవర్గంలో 70,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ (జక్రాన్ పల్లి మండలం)లో 1,10,000 ఎకరాలు, కోరుట్ల నియోజకవర్గంలో 19,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 5,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.ఈ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం 4,800 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇప్పటికే 3,300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 70శాతం పనులు పూర్తి అయినట్లు తెలిపారు.మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేస్తే 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని, దీనిద్వారా రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఇందులోనే భాగమైన మెట్ పల్లి సెగ్మెంట్ ప్యాకేజీ 21ఏ లోనే బాల్కొండ నియోజకవర్గం 70వేల ఎకరాలు, నిజామాబాద్ రూరల్ జక్రాన్ పల్లి మండలం 29వేల ఎకరాలు, కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి, ఇబ్రహీపట్నం ప్రాంతంలో 19వేల ఎకరాలు, ఆర్మూర్, మాక్లూర్ లో 5000 ఎకరాలు మొత్తంగా సుమారు 1,20,000 ఎకరాలు ఉంటుందని సభ ద్వారా ప్రభుత్వ దృష్టికి తెచ్చారు.ఈ పైప్ ఇరిగేషన్ ప్రాజెక్టు మెట్ పల్లి సెగ్మెంట్ పనులల్లో హెడ్ వర్క్స్, పంపు హౌజ్, మెయిన్ పైప్ లైన్ పూర్తయ్యి దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కేవలం మరో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 1.20 లక్షల ఎకరాలకు 3 నుండి 6 నెలల్లో నీరు అందించవచ్చని, మరో 1000 కోట్లు ఖర్చు చేస్తే మిగతా 80వేల ఎకరాలకు సాగున్నీరు అందించవచ్చని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఇప్పటికే మొత్తము ప్రాజెక్ట్ లో 70 శాతం ఖర్చు చేయబడిందని, మిగతా నిధులు మంజూరు చేసిన ప్యాకెజ్ 21 ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలనీ కోరారు.
లిఫ్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి…
ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబదించిన చిట్టాపూర్-ఫతేపూర్-సుర్బిర్యాల్ లిఫ్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శాసనసభల ప్రభుత్వాన్ని కోరారు.గత కేసీఆర్ ప్రభుత్వం కేవలం 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 9,274 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు.ఇందులో బాల్కొండ నియోజకవర్గంలో లోని బాల్కొండ, చిట్టాపూర్, శ్రీరాంపూర్ గ్రామాలకు 60 కోట్లతో 3400 ఎకరాలకు, ఆర్మూర్ నియోజకవర్గంలో ఫాతేపూర్, సుర్బిర్యాల్ గ్రామాలకు 90 కోట్లతో 5700 ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు.గత కేసిఆర్ ప్రభుత్వ హయాంలోనే 20 శాతం పనులు పూర్తయ్యాయని, గత రెండున్నర ఏళ్లుగా ఈ ప్రాజెక్టులు పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే అన్నారు.
తక్కువ ఖర్చుతోనే సాగునీరు అందించే అవకాశం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉందని తక్షణమే ఈ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిని పలు సార్లు కలిసి విన్నవించడమే కాకుండా గత అసెంబ్లీ సమావేషాల్లో ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన పనుల్లో ఇప్పటికి ఎలాంటి కదలిక లేదని పేర్కొన్నారుు. ఇప్పటికైనా ప్రభుత్వం పనుల్లో వేగం పెంచి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.



