– మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
– వాణిజ్య చర్చల్లో అమెరికా షరతులను అంగీకరించొద్దు
– జనగణన షెడ్యూల్ ప్రకటించాలి : సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో తీర్మానం
న్యూఢిల్లీ: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భద్రతా వైఫల్యమేనని సీపీఐ (ఎం) విమర్శించింది. ఉగ్రవాదుల ఇండ్లను కూల్చివేయడం వల్ల అమాయక కుటుంబాల పై ప్రభావం చూపుతుందని, కాబట్టి అలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించింది. పాక్‌పై సైనికచర్య విషయంలో ఆచీతూచి వ్యవహరించాలని కోరింది. జనగణన షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసింది. వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత మైనారిటీలపై దాడులు పెరిగాయని, ముస్లింల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను తప్పుపట్టింది. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి చేసింది. అమెరికా విధించిన సుంకాల విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న లొంగుబాటు వైఖరిని ఎండగట్టింది. వాణిజ్య చర్చల సందర్భంగా అమెరికా విధించే షరతులకు తలొగ్గవద్దని హితవు పలికింది. బీహార్ శాసనసభ ఎన్నికలకు సన్నాహకంగా మహాగట్‌బంధన్ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది. సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో శనివారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఆ వివరాలతో ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రదాడిని పొలిట్‌బ్యూరో ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాప సూచకంగా నిమిషం పాటు మౌనం పాటించింది.
పహల్గాం ఉగ్రదాడిపై…
పహల్గాంలో 26 మందిని పొట్టన పెట్టుకున్న భయానకమైన ఉగ్రవాదుల దాడిని ఖండించేందుకు, విచారం వ్యక్తం చేసేందుకు దేశం యావత్తూ ఏకమైంది. హంతకులను శిక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. ఒక పెద్ద భద్రతా లోపం కారణంగానే ఉగ్రదాడి జరిగింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులను గుర్తించి పరిష్కార చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అత్యంత ముఖ్యమైన విషయమేమంటే కాశ్మీర్ ప్రజలు ఈ ఉగ్రదాడిని నిరసిస్తూ, ఖండిస్తూ ముందుకు వచ్చారు. లోయలో జన జీవనం స్తంభించింది. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద శక్తులను ఒంటరిని చేయడానికి ప్రజలందరూ ఏకతాటి పైకి వచ్చారు. ఉగ్రవాదుల ఇండ్లు కూల్చడం వంటి చర్యలు చేపట్టకూడదు. ఎందుకంటే అవి అమాయక కుటుంబాలపై ప్రభావం చూపుతాయి. ప్రజలను దూరం చేస్తాయి. ముస్లింలు, కాశ్మీరీలపై సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ద్వేష పూరిత ప్రచారాన్ని, పౌరులపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను పొలిట్‌బ్యూరో ఖండించింది. ఇలాంటి మతోన్మాద శక్తులు ప్రజలను విడదీయాలన్న ఉగ్రవాద లక్ష్యానికి ఊతం ఇవ్వడానికి మాత్రమే దోహదపడతాయి. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలను అణచివేయడానికి ప్రభుత్వం కొన్ని దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. దాడికి పాల్పడిన వారిని, కుట్రదారులను గుర్తించి అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టడానికి ప్రభుత్వం ఓ పత్రాన్ని రూపొందించాలి. అవసరమైన జోక్యం చేసుకోవడానికి దానిని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) దృష్టికి తీసికెళ్లాలి. సీమాంతర ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి, నిరోధించడానికి సైనిక చర్య ఉపయోగపడుతుందా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించాలి.
సుప్రీం తీర్పుపై…
గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు…ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును అడ్డుకునేందుకు గవర్నర్ల అధికారాలను ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎదురు దెబ్బ. గవర్నర్లకు కాలపరిమితితో కూడిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు నిర్దేశించింది. గవర్నర్లు రాజకీయ ఏజెంట్లుగా వ్యవహరించకూడదని, రాజ్యాంగ ప్రముఖులుగా పనిచేయాలని హితవు పలికింది. తీర్పును అంగీకరించి, రాష్ట్ర శాసనసభల ఆకాంక్షలను గౌరవించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు బదులుగా సుప్రీంకోర్టు ఆదేశాలను సవాలు చేయాలని చూస్తోంది. దీనిని ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించకూడదు. ఉప రాష్ట్రపతి, కొంతమంది బీజేపీ నాయకులు చేస్తున్న కొన్ని ప్రకటనలు న్యాయస్థానాల అధికారాన్ని సవాలు చేస్తున్నాయి. వాటిని మనం ఖండించాల్సి ఉంది.
ఆపరేషన్ కగార్‌పై…
ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలలో మావోయిస్టులను ఏరివేయడానికి కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఆపరేషన్ కగార్ అక్కడి ఆదివాసీల జీవితాలలో భయాన్ని రేపుతోంది. ప్రభుత్వంతో సంప్రదింపులకు మావోయిస్టులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రభుత్వ దళాలు, మావోయిస్టుల మధ్య జరిగే ఎదురు కాల్పులలో అమాయకులైన ఆదివాసీలు ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయుధాల వినియోగం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం కాదు కాబట్టి శాంతి చర్చలకు ప్రభుత్వం అంగీకరించాలి.
అమెరికా సుంకాల యుద్ధంపై…
దాదాపు అన్ని దేశాల ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకాలను పెంచింది. కానీ ఆ తర్వాత ఒక్క చైనాను మినహాయించి మిగిలిన దేశాలన్నింటికీ సుంకాల నుంచి 90 రోజుల విరామం ప్రకటిస్తూ వెనక్కి తగ్గింది. అమెరికా చర్యను అనేక దేశాలు వ్యతిరేకించాయి. చైనా, కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్‌లు అమెరికా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను పెంచడం ద్వారా ప్రతీకార చర్యకు పూనుకున్నాయి. ఆ దేశాలకు భిన్నంగా భారత ప్రభుత్వం మన వస్తువులపై సుంకాల విధింపును వ్యతిరేకించలేదు. అంతేకాక స్వచ్ఛందంగా సుంకాలను తగ్గించి ట్రంప్ ప్రభుత్వాన్ని శాంతపరిచే ప్రయత్నం చేస్తోంది.
భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై…
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) సంతకాలు చేయడానికి భారత ప్రభుత్వం అమెరికాతో చర్చలు జరుపుతోంది. ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ సంవత్సరం చివరి నాటికి ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నారు. అమెరికా వ్యవసాయోత్పత్తుల కోసం భారత్ తన మార్కెట్‌ను అనుమతించాలని, పేటెంట్ చట్టాలలో కూడా మార్పులు తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం కోరుతోంది. రైతులకు, దేశ ప్రయోజనాలకు హాని కలిగించే ఇలాంటి ప్రయత్నాలన్నింటినీ భారత్ ప్రతిఘటించాలి.
గాజాలో మారణహోమంపై…
పాలస్తీనాలోని గాజాపై కొనసాగుతున్న యుద్ధాన్ని పొలిట్‌బ్యూరో ఖండించింది. ఇజ్రాయిల్ దాడులు, సహాయ సామగ్రిని తరలించే వాహనాలపై విధించిన నిషేధం కారణంగా గాజా ప్రజలు మూకుమ్మడిగా ఆకలితో బాధపడుతున్నారు. ఇజ్రాయిల్‌పై కాల్పుల విరమణ ప్రకటించడానికి, గాజాలోకి ఆహారం, ఇతర నిత్యా వసరాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా కావడా నికి అంతర్జాతీయ సమాజం వెంటనే ఒత్తిడి తీసుకురావాలి.
బీహార్ ఎన్నికలపై…
బీహార్ శాసనసభకు అక్టోబరులో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి పార్టీ సన్నాహాలు ప్రారంభిస్తుంది. ఇప్పటికే మహాగట్‌బంధన్ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతోంది.
కేంద్ర కమిటీ సమావేశంపై…
నూతనంగా ఎన్నికైన పార్టీ కేంద్ర కమిటీ వచ్చే నెల 3-5 తేదీలలో న్యూఢిల్లీలో సమావేశమవుతుంది.
వక్ఫ్ చట్టం, మతపరమైన దాడులపై…
బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత దేశంలోని వివిధ నగరాలలో మైనారిటీలపై మతపరమైన దాడులు జరిగాయి. ముస్లింల ఆస్తులను లక్ష్యంగా చేసుకొని వాటిని తగలబెట్టారు. బీజేపీ ఈ బిల్లును ఉపయోగించుకొని మత ప్రాతిపదికన ప్రజలను సమీకరించి మైనారిటీలపై దాడులు చేస్తోంది. వక్ఫ్ బిల్లు తర్వాత చర్చి ఆస్తులపై దృష్టి సారించాలని కొందరు బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇది వారి వాస్తవ ఉద్దేశాలను బట్టబయలు చేస్తోంది. అన్ని మైనారిటీ వర్గాల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, రాజ్యాంగపరంగా మైనారిటీలకు సంక్రమించిన హక్కులు, రక్షణలను వారికి అందకుండా చేయడమే వారి ఉద్దేశం. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ముస్లిం తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అవి హిందూత్వ మతతత్వ శక్తుల చేతుల్లోకి వెళుతున్నాయి.
కులగణనపై…
జనగణనతో పాటే కులగణన కూడా నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా కాలంగా మేము డిమాండ్ చేస్తున్న సానుకూల నిర్ణయం. కుల సమాచారం, ఇతర వివరాల సేకరణకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల సేకరణ షెడ్యూలును ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.
పహల్గాం దాడి భద్రతా వైఫల్యమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES