Thursday, May 22, 2025
Homeజాతీయంభద్రతా వైఫల్యంతోనే పహల్గాం ఉగ్రదాడి : కాంగ్రెస్‌

భద్రతా వైఫల్యంతోనే పహల్గాం ఉగ్రదాడి : కాంగ్రెస్‌

- Advertisement -

– అమిత్‌షాదే బాధ్యత
న్యూఢిల్లీ:
నిఘా, భద్రతా వైఫల్యంతోనే ఏప్రిల్‌ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగిందని కాంగ్రెస్‌ విమర్శించింది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బాధ్యత వహించాలని తెలిపింది. దేశ రక్షణ దళాలు వంద శాతం విజయవంతమ య్యాయని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకుడిగా దారుణంగా విఫలమయ్యారని కాంగ్రెస్‌ విమర్శించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎఐసిసి మాజీ సైనికుల విభాగం చైర్‌పర్సన్‌ రోహిత్‌ చౌదరి ఆపరేషన్‌ సిందూర్‌ అనేది పూర్తిగా సైనిక విజయమని, మోడీ రాజకీయంగా పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. ‘పహల్గాం దాడి ఎలా జరిగిందో.. ఆపరేషన్‌ సింధూర్‌ ఎలా ప్రారంభించారో.. ప్రజలకు వెల్లడించాలని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజల్ని ఒకరి తరువాత ఒకర్ని చంపి ఉగ్రవాదులు సురక్షితమైన మార్గం గుండా తప్పించుకోవడం నేను గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇది భద్రతా వైఫల్యం, హోం మంత్రిత్వ శాఖ వైఫల్యం’ అని రోహిత్‌ చౌదరి అన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ ‘ఆకస్మిక కాల్పుల విరమణ’ ప్రకటించడానికి ముందే భారత సైన్యం పాకిస్తాన్‌పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించిందని తెలిపారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్‌ పూర్తి ఆధిపత్యాన్ని సాధించి, ఆ దేశాన్ని రెండు భాగాలుగా విభజించిందని గుర్తు చేశారు. ఈసారి కూడా అదేవిధమైన ఆధిపత్యాన్ని భారత్‌ సైన్యం సాధించిందని, అయితే ప్రధాని మోడీ నేతృత్వంలోని రాజకీయ నాయకత్వం విఫలమైందని, అమెరికా ఒత్తిడితో కాల్పుల విరమణకు అంగీకరించిందని విమర్శించారు. ‘అమెరికా నేల నుంచి కాల్పుల విరమణ ప్రకటించారు. ఇది మనకు సిగ్గుచేటు’ అని తెలిపారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌కు ముందే పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చామని విదేశాంగ మంత్రి చెబుతున్నారు. ఇది యావత్తు దేశాన్ని, సైన్యాన్ని, సైనికులను పణంగా పెట్టడమే. ఇది దేశానికి మోడీ నాయకత్వం చేసిన స్పష్టమైన ద్రోహం’ అని విమర్శించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో భారత్‌ సైన్యం యొక్క శౌర్యం, ధైర్యానికి సెల్యూట్‌ చేస్తూ ఈ నెల 24 నుంచి 31 వరకూ ‘జై హింద్‌’ సమావేశాలు నిర్వహించి ప్రజల వద్దకు వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిందని చౌద రి తెలిపారు. మొదటగా 16 నగరాల్లో జై హింద్‌ సమావే శాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో వింగ్‌ కమాండర్‌ (రిటైర్డ్‌) అనుమ ఆచార్య కూడా మాట్లాడా రు. ఉగ్రవాదులను ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలే దని ప్రశ్నించారు. మూడో పక్షం ద్వారా కాల్పుల విరమణ ఆకస్మాత్తుగా ఎందుకు ప్రకటించారో దేశం తెలుసుకోవాలను కుంటుందని ఆమె తెలిపారు. అలాగే, జాతీయ భద్రత అంశంపై ఈ నెల 25న ఎన్‌డిఎ ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించే సమావేశంలో ఎన్‌డియేఇతర పార్టీల ముఖ్యమంత్రులను కూడా చేర్చాలని ఆమె డిమాండ్‌ చేశారు. ‘సమావేశానికి ఆహ్వానించకపోవడానికి వారు చేసిన నేరం ఏమిటి?’ అని ఆమె ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -