నవతెలంగాణ-హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికా దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ట్రంప్ తాజాగా సమర్థించుకున్నారు. పాకిస్థాన్ ) రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అయితే, వారు దాని గురించి మాట్లాడటం లేదని పేర్కొన్నారు.
సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రష్యా, చైనా, పాకిస్థాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు అణు పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కానీ వారు వాటిగురించి మాట్లాడటం లేదు. మేము అలా కాదు. వారికి భిన్నంగా ఏదైనా బహిరంగంగానే చేస్తాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధ సామర్థ్యంలో అమెరికా, రష్యా, చైనా ఐదేళ్లలోపు సమానస్థాయికి చేరుకునే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అందుకే మళ్లీ అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాల్సి వచ్చిందని వివరించారు.



