Thursday, October 9, 2025
E-PAPER
Homeఆటలువరల్డ్ కప్ లో వరుసగా మూడోసారి ఓడిన పాకిస్థాన్..

వరల్డ్ కప్ లో వరుసగా మూడోసారి ఓడిన పాకిస్థాన్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ -హైద‌రాబాద్‌: ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో పాకిస్థాన్ ఆటతీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఈ టోర్నమెంట్‌లో ఆ జట్టు వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. బుధవారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో బెత్ మూనీ అద్భుత సెంచరీతో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ ఒక దశలో కష్టాల్లో పడింది. 115 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే ఈ క్లిష్ట సమయంలో ఓపెనర్ బెత్ మూనీ (109 పరుగులు) అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా, చివర్లో అలానా కింగ్ (51 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో జట్టుకు అండగా నిలిచింది. వీరిద్దరి పోరాటంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. పాక్ బౌలర్లలో నష్రా సంధు 3 వికెట్లు పడగొట్టగా, ఫాతిమా సనా, రమీన్ షమీమ్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా బౌలర్ల సమష్టి ప్రదర్శన ముందు ఏ దశలోనూ నిలవలేకపోయారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ 36.3 ఓవర్లలో కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయ్యారు. పాక్ జట్టులో సిద్రా అమీన్ (35) మాత్రమే కాస్త ఫరవాలేదనిపించింది. ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్ 3 వికెట్లు పడగొట్టగా, మేగన్ షట్, అనాబెల్ సదర్లాండ్ చెరో రెండు వికెట్లు తీసి పాక్ పతనంలో కీలక పాత్ర పోషించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -