నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల సరిహద్ద వద్ద దాడులు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. ఇస్లామాబాద్ ప్రభుత్వం దీన్ని ఓపెన్ వార్ గా ప్రకటిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తతగా మారాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు. “మా సహనం ముగిసింది. ఇప్పుడు ఇది బహిరంగ యుద్ధం” అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య పరిస్థితి ఎంత తీవ్రమైందో చూపిస్తున్నాయి.
కాగా.. గత ఆదివారం ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపిందని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఆ దాడుల్లో పలు మంది మరణించారని పేర్కొంది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘాన్ సైన్యం గురువారం రాత్రి పాకిస్థాన్ సరిహద్దు పోస్టులపై దాడి చేసి, డజను పైగా ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది.అయితే ప్రాణనష్టంపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఈ ఘర్షణలో నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ ఓపెన్ వార్ ప్రకటించడం ఆందోళన కరంగా మారింది.



