Saturday, May 10, 2025
Homeజాతీయంఆగని పాక్‌ దుశ్చర్యలు

ఆగని పాక్‌ దుశ్చర్యలు

- Advertisement -

– 36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో దాడికి యత్నం
– ఆగని షెల్లింగ్‌ దాడులు
– దీటుగా తిప్పికొడుతున్న భారత్‌ సైన్యం
– త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ
– సరిహద్దు భద్రతపై సమీక్ష
– 14 వరకూ పలు విమానాశ్రయాల మూసివేత
– ఏడుగురు చొరబాటుదారుల హతం
– ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారాలు
న్యూఢిల్లీ:
భారత సరిహద్దుల్లో పాకిస్తాన్‌ దుశ్చర్యలు ఆగడం లేదు. సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లతో దాడికి యత్నం చేస్తోంది. భారత సైన్యం వీటిని దీటుగా తిప్పికొడుతోంది. జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాదాపు 400 డ్రోన్లతో పాక్‌ ఈ దాడులకు పాల్పడినట్టు భారత సైన్యం తెలిపింది. ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.. కర్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం తుర్కియేకు చెందిన ‘ఆసిస్‌గార్డ్‌ సోంగర్‌’ డ్రోన్లను ప్రయోగించినట్టు తెలిసిందన్నారు.
‘పాకిస్తాన్‌ నుంచి 300 -400 డ్రోన్ల వరకు వచ్చాయి. వీటిలో అనేక డ్రోన్లను కూల్చేశాం. పంజాబ్‌ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నాం. ఈ దాడుల్లో అనేకమంది గాయపడ్డారు. పాక్‌ దాడులను భారత వాయుసేన సమర్థంగా అడ్డుకుంది. ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా పాక్‌ దాడులు చేస్తోంది. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది’ అని ఆయన చెప్పారు. అలాగే పాకిస్తాన్‌ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తోం దని తెలిపారు. ‘పాకిస్తాన్‌ డ్రోన్‌, క్షిపణి దాడులు మొదలు పెట్టినప్పటికీ.. అక్కడి పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదు. కరాచీ, లాహోర్‌ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయి. తమ దాడులకు భారత్‌ నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిసే.. పౌర విమానాలను పాకిస్తాన్‌ రక్షణ కవచంగా వాడుకుంటోంది. ఇది భారత్‌-పాక్‌ మధ్య అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో వెళ్లే విమానాలతోపాటు అక్కడి పౌర విమానాలకు సురక్షితం కాదు. అయితే అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకొని భారత వాయుసేన పూర్తి సంయమనంగా వ్యవహరించింది’ అని రక్షణశాఖ ప్రతినిధులు కర్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లు వెల్లడించారు.
ఏడుగురు చొరబాటుదారుల హతం
జమ్మూకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడేందుకు పాక్‌ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్‌ఎఫ్‌ తిప్పికొట్టింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో సాంబ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ పరిణామాలు చోటుచేసుకు న్నట్టు బీఎస్‌ఎఫ్‌ వెల్లడించింది. ఏడుగురు చొరబాటుదారుల్ని హతమార్చినట్టు తెలిపింది. దీంతోపాటు పాక్‌కు చెందిన ధన్‌బార్‌లోని పోస్టును భారత దళాలు ధ్వంసం చేశాయి.
ఆగని షెల్లింగ్‌ దాడులు
మరోవైపు పాకిస్తాన్‌ శుక్రవారం కూడా నియంత్రణ రేఖకు అటువైపు నుంచి భారీస్థాయిలో షెల్లింగ్‌ కొనసాగిస్తోంది. ముఖ్యం గా ఉరీ, జమ్మూకశ్మీర్‌ ప్రాంతాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అనేక మంది ప్రజలు ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఇండ్లు ఖాళీ చేసి వెళుతున్నారు. పాకిస్తాన్‌తో దుశ్చర్యలతో ఆ దేశంతో పాక్‌తో సరిహద్దు పంచుకొంటున్న రాష్ట్రాలు అప్రమత్తం గా ఉన్నాయి. రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్‌ సరిహద్దును సీల్‌ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే.. కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, పంజాబ్‌లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకొంది. సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. వీటిల్లో ఫిరోజ్‌పుర్‌, పఠాన్‌కోట్‌, ఫజ్లికా, అమత్‌సర్‌, గురుదాస్‌పుర్‌, తార్న్‌ తరన్‌ స్కూళ్లను మూసివేశారు.
త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్‌ దాడులకు తెగబడుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ కూడా పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, హోంశాఖలోని సీనియర్‌ అధికారులతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షిం చారు. అలాగే, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మిలిటరీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వీరిలో సీడీిఎస్‌ అనిల్‌ చౌహాన్‌ సహా త్రివిధ దళాధిపతులు ఉన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో ప్రధాని మాట్లాడారు. భద్రతా సన్నద్ధతపై ప్రధాని ఆరాతీసి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రతాపరంగా సున్నిత ప్రాంతాలైన కచ్‌, బనస్కంతా, పటాన్‌, జామ్‌నగర్‌లో పౌరుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అడిగారు.
ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారాలు
పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్‌ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది. ఇందులోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది. రెగ్యులర్‌ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. టెరిటోరియల్‌ లేదా ప్రాదేశిక ఆర్మీ అంటే సైనిక రిజర్వ్‌ ఫోర్స్‌. దేశంలో క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్‌ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. ఇందులోని సిబ్బంది, అధికారులకు రెగ్యులర్‌ ఆర్మీ తరహాలోనే శిక్షణ ఇస్తారు. వీరంతా బయట ఉద్యోగాలు చేసుకుంటూనే వాలంటరీగా సైన్యంతో పనిచేస్తుంటారు. 1948లో భారత టెరిటోరియల్‌ ఆర్మీ చట్టం ఆమోదించారు. ఆ తర్వాత 1949లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 50 వేల మంది వరకు ఈ ఆర్మీలో ఉన్నట్లు సమాచారం. వీరంతా రెగ్యులర్‌ ఆర్మీలో భాగమే అయినప్పటికీ.. నిరంతరం సైన్యంతోనే ఉండరు. అవసరమైన సందర్భాల్లో కదన, ప్రకతి వైపరీత్యాల్లో రంగంలోకి దిగుతారు. 1962, 1965, 1971 యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి టెరిటోరియల్‌ ఆర్మీ పనిచేశారు.
14 వరకూ పలు విమానాశ్రయాల మూసివేత
దేశంలో 24 ఎయిర్‌పోర్టుల మూసివేతను కేంద్రం పొడిగించింది. ఈ నెల 14 వరకు మూసివేత అమలులో ఉంటుందని శుక్రవారం పేర్కొంది. చండీగఢ్‌, అమృత్‌సర్‌, లూధియానా, భుంటార్‌, కిషన్‌గఢ్‌, పాటియాలా, సిమ్లా, జైసల్మేర్‌, పఠాన్‌కోట్‌, శ్రీనగర్‌, జమ్మూ, బికనీర్‌, లేV్‌ా, పోర్‌బందర్‌, ఇతర నగరాల్లోని విమానాశ్రయాలు మే 14 వరకు మూసివేసినట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీనగర్‌, జమ్మూ, అమృత్‌సర్‌, లేV్‌ా, చండీగఢ్‌, ధర్మశాల, బికనీర్‌, జోధ్‌పూర్‌, కిషన్‌గఢ్‌, రాజ్‌కోట్‌లకు అన్ని విమానాలను రద్దు చేసినట్టు ఇండిగో, ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.
మరోవైపు భద్రతా ప్రోటోకాల్స్‌ వల్ల ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సేవలపై తీవ్ర ప్రభావం పడింది. శుక్రవారం మొత్తం 138 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశారు.
కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసిన కేరళ
దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్‌ సరిహద్దు రాష్ట్రాలలోని కుటుంబాలు, విద్యార్థులు సహా కేరళీయులకు సహాయం చేయడానికి కేరళ ప్రభుత్వం 24/7 హెల్ప్‌లైన్‌లతో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. తిరువనంతపురంలోని ప్రభుత్వ సచివాలయంలో కంట్రోల్‌ రూమ్‌లు పనిచేస్తాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఈ నంబర్లు 0471-2517500/2517600, ఫ్యాక్స్‌: 0471-2322600.
యుద్ధం పరిష్కారం కాదు..
చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలి : ఎఐఎంపీఎల్‌బీ
ఏ సమస్యకూ యుద్ధం పరిష్కారం కాదని, దేశాలు తమ సమస్యలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఎఐఎంపీఎల్‌బీ) తెలిపింది. తన ఆఫీస్‌-బేరర్ల ప్రత్యేక ఆన్‌లైన్‌ సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో ఎఐఎంపీఎల్‌బీ ఈ వ్యాఖ్యలు చేసింది. భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘దేశ, ప్రజల రక్షణ, భద్రత కోసం తీసుకునే అవసరమైన ప్రతి చర్యకూ ఎఐఎంపీఎల్‌బీ మద్దతు ఇస్తుంది. ఈ క్లిష్టమైన సమయాల్లో ఈ ముప్పును ఎదుర్కోవడానికి ప్రజలు, రాజకీయ పార్టీలు, సాయుధ దళాలు, ప్రభుత్వం కలిసిరావాలి’ అని బోర్డు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇస్లాం బోధనల్లో, మానవ విలువల్లో ఉగ్రవాదానికి ఎటువంటి స్థానం లేదని తెలిపింది. అలాగే, తమ ‘సేవ్‌ వక్ఫ్‌ ప్రచారం’ యథావిధిగా కొనసాగుతోందని తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బహిరంగ సమావేశాలు, కార్యక్రమాలను ఈ నెల 16 వరకూ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
ఉద్రిక్తతలు ఆందోళనకరం : చైనా విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ
బీజింగ్‌ : భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకై అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా వుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ స్పష్టం చేశారు. ఇరు దేశాల మద్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇరు పక్షాలూ సంయమనం పాటించాలని చైనా కోరింది. ప్రస్తుత పరిణామాల పట్ల బీజింగ్‌ చాలా ఆందోళనగా వుందని లిన్‌ జియాన్‌ పేర్కొన్నారు. భారత్‌, పాక్‌లు రెండూ ఇరుగు పొరుగు దేశాలే కాదని, ఆ రెండూ కూడా చైనాకు పొరుగు దేశాలని ఆయన గుర్తు చేశారు. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. శాంతి, సుస్థిరతల విస్తృత ప్రయోజనాలకు అనుగుణంగా ఇరు పక్షాలు వ్యవహరించాలని కోరుతున్నామని చెప్పారు. ఐక్యరాజ్య సమితి నిబంధనావళితో సహా అంతర్జాతీయ చట్టాలను పాటించాలని కోరారు. ప్రశాంతంగా వుండాలని, సంయమనం పాటించాలని, పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసే కార్యాచరణకు దిగకుండా వుండాలని లిన్‌ జియాన్‌ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -