నవతెలంగాణ – హైదరాబాద్ : ఉపాధి కోసం కూలి పనులకు వెళ్లిన కొందరు యువకులు, సైబర్ నేరాల్లో ఆరితేరి తిరిగివచ్చి భారీ మోసాలకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్‌లో వెలుగుచూసింది. ఆన్‌లైన్ లోన్ల పేరుతో ఏడాది కాలంలో సుమారు వెయ్యి మందిని మోసం చేసి, వారి నుంచి రూ.3 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ జానకి శనివారం మీడియాకు వెల్లడించారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం తువ్వగడ్డ తండాకు చెందిన ఏడుగురు యువకులు 2023లో ఉపాధి కోసం కోల్‌కతా వెళ్లారు. అక్కడ వారికి ఒక సైబర్ క్రైమ్ ముఠాతో పరిచయం ఏర్పడింది. వారి వద్ద ఆన్‌లైన్ మోసాలపై శిక్షణ తీసుకుని, కొంతకాలం కమీషన్ పద్ధతిపై పనిచేశారు. వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో, స్వయంగా పెద్ద మొత్తంలో సంపాదించాలనే దురాశతో 2024 చివర్లో సొంత ఊళ్లకు తిరిగొచ్చారు.
ఇక్కడికి వచ్చాక ‘ధన’, ‘ఇండియా బుల్స్’ పేరుతో నకిలీ ఆన్‌లైన్ లోన్ కాల్ సెంటర్లు ప్రారంభించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి అమాయకులను ఆకట్టుకున్నారు. లోన్ కోసం సంప్రదించిన వారి నుంచి ఆధార్, పాన్ కార్డు వివరాలు తీసుకుని, వారికి నకిలీ లోన్ మంజూరు పత్రం పంపేవారు. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇన్సూరెన్స్, తొలి ఈఎంఐ అంటూ విడతలవారీగా డబ్బులు వసూలు చేసి, ఆపై వారి ఫోన్ నంబర్లను బ్లాక్ చేసేవారు. ఈ నెల 19న మహబూబ్‌నగర్‌కు చెందిన హన్మంతు అనే వ్యక్తి నుంచి రూ.76,655 కాజేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం సిబ్బంది ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద లభించిన సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు చూసి పోలీసులు నివ్వెరపోయారు. నిందితుల నుంచి రూ.1.50 లక్షల నగదు, ఒక ఆటో, బైక్, ల్యాప్‌టాప్, పలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించి, కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తామని ఎస్పీ తెలిపారు.



