నవతెలంగాణ – మల్హర్ రావు
పోలింగ్ కేంద్రంలో వినియోగించిన బ్యాలెట్ బాక్స్లో ఉన్న బ్యాలెట్ పేపర్లను బయటకు తీసి వాటిని సర్పంచ్ (గులాబీ), వార్డు సభ్యుడు(తెలుపు రంగు) బ్యాలెట్ పేపర్లను వేర్వేరుగా చేస్తారు. వాటిని వేరుచేసే సమయంలో సర్పంచ్ బ్యాలెట్ పేపర్లను నిలువు మడత విడిపోకుండా జాగ్రత్త వహిస్తూ ఒక్కొక్కటి 25 వంతున బండిళ్లుగా చేసి రబ్బరు బ్యాండ్ వేస్తారు. పోలైన ఓట్లు బ్యాలెట్ బాక్స్లో ఉన్న ఓట్లతో సరిపోయాకే లెక్కింపు ప్రారంభిస్తారు. మొదట వార్డు సభ్యుడి బ్యాలెట్ పేపర్లను అభ్యర్థుల వారీగా వేరు చేయాల్సి ఉంటుంది.
సందేహాత్మకమైన, చెల్లని ఓట్లను వేరుగా ఉంచుతారు. చెల్లుబాటు అయిన వాటిని అభ్యర్థుల వారీగా వేరుచేసి వాటిని 25 వంతున బండిల్స్ చేస్తారు. చెల్లుబాటు కాని, సందే హాత్మకంగా ఉన్న బ్యాలెట్ పేపర్లను మరొక బండి ల్లోకి మార్చి రిటర్నింగ్ అధికారికి పంపిస్తారు. సర్పంచ్ పదవికి సంబంధించి అన్ని వార్డుల బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టడం పూర్తయ్యాక రిటర్నింగ్ అధికారి తీసుకుని పెద్ద డ్రమ్ములో వేసి కలుపుతారు. వాటిని ఒక్కో కౌంటింగ్ సూపర్ వైజర్ కు 3,4 బండిల్స్ వంతున పంచుతారు. కట్టలో ఉన్న అన్ని బ్యాలెట్ పేపర్లు వేరు చేసిన తర్వాత అభ్యర్థి వారీగా లెక్కించి రిజల్ట్ షీట్లో నమోదు చేస్తారు. అనంతరం వాటిని తిరిగి బండిల్గా మార్చి రిటర్నంగ్ అధికారికి పంపుతారు. రిటర్నింగ్ అధికారి వాటిని పరిశీలించి తుది రిజల్ట్ షీట్ తయారు చేస్తారు.



