నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు నిదర్శనం పంచాయతీ ఫలితాలు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు ఆఖండ మెజార్టీతో గెలిపించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రెండేళ్ల తర్వాత ప్రజల్లోకి వెళ్తే అద్భుతంగా జవాబు ఇచ్చారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఈనెల 17తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ వేదికగా మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించినందుకు అధికారులకు, సహకరించిన ప్రజలకు ధన్యావాదాలు తెలియజేశారు.
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ ఎస్, బీజేపీ కలిసి పోటీ చేశాయని, అయినా కానీ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కాంగ్రెస్‌ను బీట్ చేయాలేదని ఎద్దేవా చేశారు. ఇదే ఉత్సహంతో 2029లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. 12,702 పంచాయతీల్లో 7,527 జీపీల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని, రెండ్లేళ్ల తర్వాత ప్రజల్లోకి వెళ్తే సంపూర్ణంగా ఆశీర్వదించారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 66శాతం విజయాన్ని కాంగ్రెస్ నమోదు చేసిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మరోమారు పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేశారు.



