Thursday, January 8, 2026
E-PAPER
Homeజాతీయంజనవరి 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు!

జనవరి 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు!

- Advertisement -

ఆదివారం బడ్జెట్‌ నిర్వహణపై సర్వత్రా చర్చ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జనవరి 31నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలిరోజు పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న 2026-27 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడతారు. అయితే ఈ సారి ఫిబ్రవరి 1 ఆదివారం రావడంతో బడ్జెట్‌ను ప్రవేశపెడతారా లేదా అనే సందేహాలు తలెత్తుతున్న క్రమంలో ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. మరోపక్క ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌పై మధ్య తరగతి ప్రజలు, రైతులు, యువత… కోటి ఆశలు పెట్టుకున్నారు.

ఎందుకీ చర్చ..?
ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. 2017 నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే, ఈ సారి ఫిబ్రవరి 1న ఆదివారం రావడం, ఆ రోజు సెలవుదినం కావడంతో బడ్జెట్‌ ప్రవేశ పెడతారా..? లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 2న ప్రవేశపెట్టొచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంశం ఆసక్తికరంగా మారింది. అయితే, దీనిపై కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు.

ఆదివారం కూడా పార్లమెంట్‌
అయితే, వారాంతాల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం కొత్తేమీ కాదు. 2016లో తొలిసారి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వార్షిక బడ్జెట్‌ను ఆదివారమే ప్రవేశపెట్టారు. ఆ తరువాత 2025లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గతంలో ఆదివారాల్లో పార్లమెంట్‌ సమావేశమైన సందర్భాలూ ఉన్నాయి. కరోనా సమయంలో (2020), అలాగే పార్లమెంట్‌ తొలి సమావేశం 60వ వార్షికోత్సవం సందర్భంగా 2012, మే13న ఆదివారం సభ జరిగింది. ఈ లెక్కన పార్లమెంటరీ సంప్రదాయాలను అనుసరిస్తే, ఆదివారం కూడా బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదు.

ఫిబ్రవరి 1వ తేదీనే ఎందుకు..?
గతంలో కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి రోజున సమర్పించేవారు. దీనివల్ల బడ్జెట్‌ ఆమోద ప్రక్రియ ఆలస్యమయ్యేది. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ప్రభుత్వ ఖర్చుల కోసం కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నిధులను ఉపసంహరించుకునేందుకు వీలుగా పార్లమెంట్‌ ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ను ఆమోదించాల్సి వచ్చేది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలు శాఖాపరమైన డిమాండ్లను వివరంగా పరిశీలించిన తరువాత , మిగిలిన సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ఆమోదించేవారు. ఇది తీవ్ర జాప్యాలకు దారితీస్తుండటంతో.. దీన్ని నివారించేందుకు 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దీనివల్ల ఏప్రిల్‌ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే అంటే మార్చి 31లోపే బడ్జెట్‌ ఆమోద ప్రక్రియ పూర్తి చేయడానికి పార్లమెంటుకు తగినంత సమయం లభిస్తుంది. బడ్జెట్‌ సమావేశాల్లో వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే 30 రోజులకుపైగా జైలు జీవితం గడిపే సీఎంలు, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును కూడా ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -