- రాష్ట్ర పురావస్తు, వారసత్వ శాఖ – సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో అవగాహన ఒప్పందం
నవతెలంగాణ-హైదరాబాద్: ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పురావస్తు-వారసత్వ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ఒప్పందంపై తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుత్తడి సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్లు సంతకాలు చేశారు.
ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థుల్లో వారసత్వంపై అవగాహన పెంపొందించడం, పురావస్తు సంపద పరిరక్షణలో యువతను భాగస్వామ్యం చేయడం, స్థానిక చారిత్రక స్థలాలపై పరిశోధనాత్మక కార్యక్రమాలు నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే కళాశాల స్థాయిలో హెరిటేజ్ క్లబ్‌ల ఏర్పాటు, ఫీల్డ్ విజిట్స్, వర్క్‌షాపులు, సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు చారిత్రక, సాంస్కృతిక విలువలపై అవగాహన పెరగడంతో పాటు వారసత్వ పరిరక్షణలో బాధ్యతాయుత పాత్ర పోషించేలా ప్రోత్సాహం లభిస్తుందని డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుత్తడి పేర్కొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్లు ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు డిప్యూటీ డైరెక్టర్ డా. పి.నాగరాజు, OSD రాజు, ప్రిన్సిపాల్స్, ప్రొ.బంగ్లా భారతి, ప్రొపెసర్లు పి.రమేష్, ఎం.ప్రవీణ, అరుణ భాయ్, నారాయణ, అస్లాం ఫరూక్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఈ MoUలో భాగంగా క్రింది కళాశాలలు భాగస్వాములయ్యాయి:
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సదాశివపేట
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జహీరాబాద్
- ప్రభుత్వ తారా డిగ్రీ & పీజీ కళాశాల, సంగారెడ్డి
- ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, సంగారెడ్డి
- ఎన్.ఎం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జోగిపేట
- డా. ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పటాంచెరువు
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నారాయణఖేడ్



