No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. ప్రయాణికుడిపై దాడి

ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. ప్రయాణికుడిపై దాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడింది బీజేపీకి చెందిన ఒక శాసనసభ్యుడి అనుచరులేనని ఆరోపణలు వస్తున్నాయి. తాను కూర్చున్న సీటును ఎమ్మెల్యే కోసం ఖాళీ చేయడానికి ఆ వ్యక్తి నిరాకరించడమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ఢిల్లీ-భోపాల్ వందే భారత్ రైలులో గత గురువారం ఈ ఘటన జరగ్గా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్, గత వారం తన కుటుంబ సభ్యులతో కలిసి వందే భారత్ రైలులో తన నియోజకవర్గానికి ప్రయాణిస్తున్నారు. రైలు కంపార్ట్‌మెంట్‌లో ఆయన భార్య, కుమారుడికి ముందు వరుసలో సీట్లు లభించగా, ఎమ్మెల్యేకు వేరే చోట సీటు కేటాయించారు. దీంతో తన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చోవాలనే ఉద్దేశంతో వారి పక్కనే ఉన్న ప్రయాణికుడిని తన సీటుతో మార్చుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అయితే, ఆ ప్రయాణికుడు అందుకు అంగీకరించలేదు.

ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే రైలు ఝాన్సీ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, ఎమ్మెల్యే అనుచరులుగా భావిస్తున్న ఆరుగురు వ్యక్తులు రైలు ఎక్కారు. వారు నేరుగా సదరు ప్రయాణికుడి వద్దకు వెళ్లి, సీటులోనే అతనిపై పిడిగుద్దులతో దాడి చేశారు. చెప్పులతో కూడా కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ దాడిలో భోపాల్‌కు వెళుతున్న ఆ ప్రయాణికుడు గాయపడ్డాడు. అతని ముక్కు నుంచి రక్తం కారడం, బట్టలపై రక్తపు మరకలు ఉండటం వీడియోలో స్పష్టంగా రికార్డయింది.

ఈ ఘటనపై రైల్వే సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ విపుల్‌ కుమార్‌ స్పందించారు. సీటు విషయంలో తలెత్తిన వివాదమే ఈ దాడికి కారణమని ఆయన ధృవీకరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

అయితే, ఈ వ్యవహారంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దాడికి గురైన ప్రయాణికుడు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు. మరోవైపు తన కుటుంబ సభ్యుల పట్ల సదరు ప్రయాణికుడు అమర్యాదగా ప్రవర్తించాడంటూ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad