– స్టేజి దాటి వెళుతుందనుకోని ప్రయాణిస్తున్న బస్సులో నుంచి దిగిన ప్రయాణికుడు
– తలపై బస్ టైర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి
నవతెలంగాణ – రాయపోల్
ప్రమాదవశత్తు బస్సు కిందపడి ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన రాయపోల్ మండలం చిన్న మాసాన్ పల్లి గ్రామ బస్ స్టాప్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 7:30 సమయంలో చోటుచేసుకుంది. స్థానికులు, తోటి ప్రయాణికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన యాకటి నర్సింలు (40) తమ బంధువుల గ్రామమైన గజ్వేల్ మండలం బెజగామ గ్రామానికి వెళ్లడానికి సాయంత్రం అహ్మద్ నగర్ గ్రామంలో రామాయంపేట నుంచి గజ్వేల్ వెళ్తున్న బస్సు ఎక్కాడు. అతడు చిన్న మాసాన్ పల్లి గ్రామం బస్ స్టాప్ లో బస్సు దిగుతానని టికెట్ తీసుకొని ప్రయాణిస్తున్నాడు.
మాసాన్ పల్లి బస్ స్టాప్ రాకముందే కొద్ది దూరంలోనే ప్రయాణిస్తున్న బస్సులో నుంచి దిగాడు. బస్సు ప్రయాణంలో ఉంది కాబట్టి వెనక చక్రం నర్సింలు తల పై నుంచి వెళ్ళింది. ఈ ప్రమాదంలో నర్సింలు తలకు తీవ్ర గాయాలై మెదడు పూర్తిగా రోడ్డు మీద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేసేంతవరకు బస్సు, మృతదేహం తరలించేది లేదని డిమాండ్ చేయడంతో సంఘటన స్థలం చేరుకున్న రాయపోల్ ఎస్ఐ మానస, పోలీస్ సిబ్బంది డిపో మేనేజర్ తో మాట్లాడటం జరిగిందని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో బస్సును పోలీస్ స్టేషన్ తరలించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు నర్సింలుకు భార్య శ్యామల ముగ్గురు కుమారులు ప్రశాంత్, రామ్, లక్ష్మణ్ ఉన్నారు. వీరిది నిరుపేద కుటుంబం ఎలాంటి ఆస్తిపాస్తులు, భూమి లేదని గ్రామస్తులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని రాయపోల్ ఎస్సై మానస తెలిపారు.



