Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకమల్ హాసన్‌కు ఆస్కార్ అవార్డుల కమిటీలో సభ్యత్వం..పవన్ కళ్యాణ్ అభినందనలు

కమల్ హాసన్‌కు ఆస్కార్ అవార్డుల కమిటీలో సభ్యత్వం..పవన్ కళ్యాణ్ అభినందనలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: విశ్వనటుడు, పద్మభూషణ్ కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం దక్కడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్)-2025 కమిటీలో సభ్యుడిగా కమల్ హాసన్ ఎంపిక కావడం పట్ల ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది భారత సినీ పరిశ్రమకే గర్వకారణమని కొనియాడారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, కమల్ హాసన్ బహుముఖ ప్రజ్ఞను, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఆరు దశాబ్దాలకు పైబడిన అద్భుతమైన నట జీవితంతో, కమల్ హాసన్ గారు ఒక నటుడిగా కంటే ఎంతో ఎక్కువ. నటుడిగా, కథకుడిగా, దర్శకుడిగా ఆయన సినిమాపై చూపిన ప్రభావం భారతీయ చిత్ర పరిశ్రమపైనే కాకుండా ప్రపంచ సినిమాపైనా చెరగని ముద్ర వేసింది” అని పవన్ కల్యాణ్ వివరించారు.

సినిమా నిర్మాణంలోని ప్రతి అంశంలోనూ కమల్ హాసన్‌కు ఉన్న పట్టు ప్రశంసనీయమని పవన్ పేర్కొన్నారు.”రచయితగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా సినిమాలోని అన్ని విభాగాలపై ఆయనకు ఉన్న పట్టు నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన ఆ రంగంలో ఒక నిజమైన మాస్టర్” అని తన సందేశంలో తెలిపారు. కమల్ హాసన్ ప్రపంచ సినిమాకు మరిన్ని సంవత్సరాలు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. కమల్ హాసన్‌కు దక్కిన ఈ గౌరవంతో భారతీయ సినిమా ఖ్యాతి మరింత పెరిగిందని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img