Wednesday, August 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపిట్టల్లా రాలుతున్న జనం

పిట్టల్లా రాలుతున్న జనం

- Advertisement -

చిన్నారితో సహా మరో 8మంది ఆకలికి బలి
సాయం కోసం అంతర్జాతీయ చారిటీ సంస్థలకు తల్లుల వేడుకోళ్ళు
పదాతి, వైమానిక దాడులు ఉధృతం
గాజా
: గాజాలోని వివిధ ప్రాంతాల్లో వైమానిక, పదాతి దాడులను ఇజ్రాయిల్‌ ముమ్మరం చేసింది. మరోవైపు గాజాలో ఆకలి కేకలు కొనసాగుతునే వున్నాయి. ఇజ్రాయిల్‌ కృత్రిమంగా కల్పించిన ఈ కరువు కాటకాల పరిస్థితులకు గాజా ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా గత 24గంటల్లో ఆకలికి తాళలేక మరో 8మంది మరణించారు. వీరిలో ఒక చిన్నారి కూడా వున్నాడని ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. ప్రజలకు మానవతా సాయం అందడానికి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న ఇజ్రాయిల్‌ ఆచరణలో అమలు చేస్తున్న చర్యలకు సంబంధించిన డేటాను గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం వెల్లడించింది. సోమవారం గాజాకు కేవలం 95 ట్రక్కుల ఆహారాన్ని అనుమతించారు. గాజాలోని ప్రజల కనీసపు అవసరాలు తీరాలంటే ప్రతి రోజూ కనీసం 600 ట్రక్కుల ఆహారం అవసరం కాగా, అందులో కేవలం 15శాతానికి సమానమైన మొత్తాన్నే ఇజ్రాయిల్‌ అనుమతిస్తోందని మీడియా కార్యాలయం తెలిపింది.
ఆకలి అని ఏడుస్తున్న పిల్లలకు ఆహారం పెట్టేందుకు లేక తల్లులు మానసికంగా చిత్రవధ అనుభవిస్తున్నారని, తమ పిల్లలకు ఆహారం అందించాలంటూ వారు అంతర్జాతీయ చారిటీ సంస్థలకు విజ్ఞప్తులు చేస్తున్నారని ఆక్స్‌ఫామ్‌ అంతర్జాతీయ మీడియా, కమ్యూనికేషన్స్‌ ఆఫీసర్‌ ఘదా అల్హాద్దాద్‌ పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ అనుసరిస్తున్న ఈ విధానం పెద్దా, చిన్నా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తోందని ఆమె అన్నారు. పైగా దీనివల్ల అనేక అంటువ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి గాజాలోని వ్యవసాయ భూములను ఇజ్రాయిల్‌ పనిగట్టుకుని నాశనం చేయడం వల్ల ఆహార కొరత విపత్తు మరింత ముదురుతోందని అన్నారు. ఇప్పటికే వున్న ఇళ్ళు కోల్పోయి, తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకున్న ప్రజలు ఎటూ దిక్కుతోచని స్థితిలో వున్నారు.
గాజాలో క్షేత్ర స్థాయిలో నెలకొన్న వాస్తవిక పరిస్థితులను బయటి ప్రపంచానికి తెలియచేయడానికి అనుమతించాలంటూ విదేశీ జర్నలిస్టులు చేపట్టిన ‘ఫ్రీడమ్‌ టు రిపోర్ట్‌’ చొరవను హమాస్‌ సమర్ధించింది. గాజాలో కేవలం మానవతా సాయాన్ని మాత్రమే నిషేధించలేదు, సమాచారాన్ని కూడా నిషేధించారు. దీనివల్ల అక్కడి దయనీయ, దుర్భర పరిస్థితులు బయటి ప్రపంచానికి పొక్కడం లేదు. దీనివల్ల సమాచారం తెలుసుకునే ప్రజల హక్కు, జర్నలిజం హక్కులు కాలరాయబడుతున్నాయని విమర్శిస్తూ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రీ లియోహన్‌ ఈ చొరవను చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -