నవతెలంగాణ-హైదరాబాద్ : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ అంటే ప్రజలు ఎలా మండిపడుతున్నారో చెప్పే ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. స్థానికంగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిపై కొందరు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రధాన నిందితుడితో సహా పది మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. మంగళూరు శివార్లలోని కుడుపు గ్రామంలో భట్ర కల్లూర్తి ఆలయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అక్కడ జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌లో మృతుడికి, సచిన్ అనే మరో వ్యక్తికి మధ్య మొదట వాగ్వాదం చోటుచేసుకుంది. అది తీవ్ర ఘర్షణగా మారి, కొందరు గుంపుగా చేరి బాధితుడిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి, కాళ్లతో తన్నారు. సాయంత్రం ఆలయ సమీపంలో బాధితుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనను కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర ధృవీకరించారు. క్రికెట్ మ్యాచ్‌లో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని అరిచినందుకు కొందరు దాడి చేశారని, బాధితుడు తర్వాత మరణించాడని ప్రాథమిక సమాచారం ఉందన్నారు. 10-12 మందిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ మాట్లాడుతూ, పోస్టుమార్టంలో తీవ్ర గాయాల వల్లే మృతి చెందినట్లు నిర్ధారణ అయిందన్నారు. వెన్నుపై పదేపదే కొట్టడం వల్ల అంతర్గత రక్తస్రావం, షాక్‌తో మరణించినట్లు నివేదిక వెల్లడించిందని తెలిపారు. ప్రధాన నిందితుడైన సచిన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది నేరంలో పాల్గొనడంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కఠిన సెక్షన్లు నమోదు చేశామని, దీని కింద జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉందని వివరించారు. స్థానికుడి ఫిర్యాదు మేరకు 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటా ఆధారంగా పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
పాకిస్థాన్ జిందాబాద్ అన్నాడు..కొట్టి చంపారు!
- Advertisement -
RELATED ARTICLES