– ఏపీకి కేంద్రం బిగ్ షాక్
– రేవంత్ సర్కారు తొలి విజయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. బనకచర్లకు పర్యావరణ అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్టు కోసం ఏపీ పంపిన ప్రతిపాదనలను కేంద్రం తిప్పి పంపింది. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలటే కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) పరిశీలించాల్సి ఉందనీ, ఈమేరకు సీడబ్ల్యూసీని సంప్ర దించాలని ఏపీకి సూచించింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయనీ, అనుమతులు ఇవ్వాలంటే 1983లో గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ (జీడబ్ల్యూటీటీ) ఇచ్చిన తీర్పును పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ఈ తీర్పునకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వపై కేంద్రంతో అధ్యయనం, రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలకు అన్నీ అనుమతులు, పర్యావరణ ప్రభావంపై అంచనా వేసిన తర్వాతే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అనుమతివ్వడానికి సాధ్యమవుతుందని నిపుణుల కమిటీ పేర్కొంది.అంతరాష్ట్ర జల వివాదానికి క్లియరెన్స్ తెచ్చుకోవా లంటూ మరో సూచన చేసింది. ఇదిలావుండగా రూ. 82 వేల కోట్లతో ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఇటీవల కాలంలో అనేక ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. ముఖ్యమంత్రితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు పలుమార్లు ప్రధానితోపాటు కేంద్ర జలశక్తిశాఖకు స్వయంగా ఫిర్యాదులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందనీ, వెంటనే ఆప్రాజెక్టు ప్రతిపాదన లను తొలి దశలోనే తిరస్కరించాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు కోసం ఏపీ పంపిన ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పరిశీలించింది. అనంతరం అనుమతులు ఇవ్వడానికి తిరస్కరించింది. వరద జలాల్లోని మిగులును మాత్రమే బనకచర్ల కోసం వాడుకుంటామంటూ ఏపీ ప్రతిపాదనలు పంపిన విషయం విదితమే. ఇదిలావుండగా కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ నిర్ణయం పట్ల తెలంగాణ ప్రభుత్వం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసింది.
బనకచర్లకు అనుమతులివ్వలేం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES