Magazines

దశాబ్దపు తెలంగాణ సాహిత్యానికి నిలువెత్తు దర్పణం

44 నిమిషాల క్రితం

Telangana Literature
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 5 నిమిషాల చదవడం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తవుతున్న సందర్భంలో, రాష్ట్ర ఆవిర్భావానంతర తొలి దశాబ్దపు సాహిత్యాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమ కాలంలో తెలంగాణ సాహిత్యం ఒక ప్రత్యేకమైన చారిత్రక బాధ్యతను నిర్వర్తించింది. ప్రాంతీయ అస్తిత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, భాషా– సాంస్కృతిక ప్రత్యేకత వంటి అంశాలు కవిత్వంలోనూ, పాటలోనూ, కథలోనూ బలంగా వ్యక్తమయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారింది. అప్పటివరకు ముందున్న లక్ష్యం రాష్ట్ర సాధన అయితే, ఆ తర్వాతి కాలంలో రాష్ట్రం సాధించిన తర్వాతి సమాజాన్ని అర్థం చేసుకోవడం సాహిత్యం ముందున్న కొత్త బాధ్యతగా మారింది.


ఈ సంచికను చదువుతున్నప్పుడు ముందుగా కనిపించేది దాని విస్తృతి. కానీ కేవలం విస్తృతి ఉన్నంత మాత్రాన దశాబ్దపు సాహిత్య చిత్రపటం పూర్తికాదు. ఎవరు రాశారు? ఏమి రాశారు? అనే ప్రశ్నలతో పాటు ఎందుకు రాశారు? ఏ సామాజిక పరిస్థితి ఆ రచనకు కారణమైంది? ఆ రచన తన కాలంతో ఎలాంటి సంభాషణ జరిపింది? అనే ప్రశ్నలు కూడా ముందుకు రావాలి. ఈ ప్రశ్నలతో సంచికను చదివినప్పుడు ఇందులోని వ్యాసాలకు మరింత అర్థం కనిపిస్తుంది. ‘తెలంగాణ జీవ ద్రవ్యం కవిత్వమే’ అనే వ్యాస శీర్షిక తెలంగాణ సాహిత్యంలో కవిత్వానికి ఉన్న స్థానాన్ని చెప్పకనే చెబుతుంది. తెలంగాణ ఉద్యమానికి కవిత్వం ఎంత దగ్గరగా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఉద్యమం ముగిసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కవిత్వం ముందున్న పరీక్ష వేరైంది. ఉద్యమ ఆకాంక్షలను పునరావృతం చేయడం కంటే, ఆ ఆకాంక్షల సాకార రూపాన్ని ప్రశ్నించడం అవసరమైంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాన్యుడి జీవితంలో ఏ మార్పులు వచ్చాయి? పల్లె జీవితంలో ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి? యువత ఆకాంక్షలు, నిరుద్యోగం, వలసలు, సామాజిక అసమానతలు, కొత్త మధ్యతరగతి జీవన విధానం వంటి అంశాలు కవిత్వంలో ఎలా వ్యక్తమయ్యాయి? ఈ ప్రశ్నలతో దశాబ్దపు కవిత్వాన్ని మరింత లోతుగా చదవాల్సి ఉంటుంది. సినారె, నిఖిలేశ్వర్, గద్దర్ వంటి సాహిత్య వ్యక్తిత్వాలపై వచ్చిన రచనలు తెలంగాణ సాహిత్యంలోని విభిన్న ప్రవాహాలను గుర్తు చేస్తాయి. ముఖ్యంగా గద్దర్‌పై వచ్చిన ‘విప్లవాల గానలోలుడు గద్దర్’ వంటి రచనలు తెలంగాణ ప్రజా సాహిత్య చరిత్రను ఉద్యమ చరిత్రతో విడదీయలేని సంబంధంలో చూడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాయి. అదే సమయంలో కొత్త తరపు కవిత్వం ఉద్యమ వారసత్వాన్ని ఎలా స్వీకరించింది? దాన్ని ఎలా అధిగమించింది? అనే అంశం కూడా పరిశీలనకు రావాలి.

కథ విషయంలో ‘తెలుగు కథ నిన్న–నేడు–రేపు’, ‘తెలంగాణ దశాబ్ది కథా భూస్వామ్య పెత్తందారీ పరిణామాలు’ వంటి వ్యాసాలు ఆసక్తిని కలిగిస్తాయి. తెలంగాణ కథకు మాండలికం ఒక బలమైన ఆయుధం. కానీ మాండలికంలో రాయడం ఒక్కటే తెలంగాణ కథకు ప్రమాణం కాదు. ఆ భాష వెనుక ఉన్న మనిషిని, అతని జీవితాన్ని, అతని సామాజిక స్థితిని రచయిత ఎంతవరకు పట్టుకున్నాడన్నదే ముఖ్యం. భూస్వామ్య అవశేషాలు, గ్రామీణ అధికార సంబంధాలు, కుల నిర్మాణాలు, వలసలు, పట్టణీకరణ వంటి పరిణామాలు కథల్లో ఎలా ప్రతిఫలించాయో పరిశీలించినప్పుడే దశాబ్దపు కథా సాహిత్యాన్ని సరిగ్గా అంచనా వేయగలం. ‘ఒక దశాబ్ది తెలంగాణ నవల’ అనే అంశం కూడా ఇలాంటి ప్రశ్నలను ముందుకు తెస్తుంది. నవలకు విస్తృతమైన జీవన చిత్రణకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో చోటు చేసుకున్న సామాజిక మార్పులను నవల ఎంతవరకు తనలోకి తీసుకుంది? తెలంగాణను కేవలం నేపథ్యంగా ఉపయోగించిన నవలలు ఎన్ని? తెలంగాణ సమాజపు అంతర్గత సంఘర్షణలను కథా వస్తువుగా చేసుకున్న రచనలు ఎన్ని? అనే ప్రశ్నలు పరిశోధకుల ముందున్నాయి. ఈ దిశలో మరింత సమగ్ర పరిశీలన జరగాల్సి ఉంది. తెలంగాణ సాహిత్యాన్ని పాట లేకుండా ఊహించలేం. గద్దర్, గూడ అంజయ్య, అందెశ్రీ, కందికొండ వంటి గీత రచయితలపై వచ్చిన రచనలు ఈ సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతర పాట’, ‘సినిమాపాటల్లో సాహిత్యపు విలువలు’ వంటి అంశాలు పాటకు సంబంధించిన చర్చను మరింత విస్తరిస్తాయి. ఉద్యమ కాలపు పాటకు ఉన్న ఉత్సాహం ఒకటైతే, ఉద్యమానంతర కాలపు పాట ఎదుర్కొనే సామాజిక వాస్తవికత మరోటి.

ప్రజాదరణ పొందిన ప్రతి పాటను సాహిత్యపరంగా గొప్పదిగా చూడటం ఎంత సరైంది కాదో, ప్రజల మధ్య బతికిన పాటను పుస్తకాల్లో లేదనే కారణంతో విస్మరించడం కూడా అంతే సరికాదు. ఈ దశాబ్దంలో తెలంగాణ సాహిత్యానికి వచ్చిన మరో ముఖ్యమైన మార్పు అస్తిత్వ స్వరాల విస్తరణ. దళిత, బహుజన, ముస్లిం, గిరిజన, మహిళా సాహిత్యాలపై ప్రత్యేక చర్చలు ఈ సంచికలో కనిపిస్తాయి. ఇది కేవలం అంశాల విస్తరణ కాదు; సాహిత్యంలో ఎవరి జీవితం మాట్లాడాలి అనే ప్రశ్నలో వచ్చిన మార్పు. ఇంతకాలం ప్రధాన సాహిత్య చర్చలో అంచులకు నెట్టబడిన అనుభవాలు తమ స్వంత గొంతుతో ముందుకు రావడం సాహిత్య ప్రజాస్వామ్యానికి సంకేతం. అయితే అస్తిత్వ సాహిత్యాన్ని కేవలం ఆయా వర్గాల సమస్యల జాబితాగా చూడటం ప్రమాదకరం. దళిత సాహిత్యం తన ప్రత్యేక అనుభవంతో తెలుగు సాహిత్యపు సౌందర్య దృష్టినే ప్రశ్నించింది. గిరిజన సాహిత్యం ప్రకృతి, భూమి, జీవన విధానాల మధ్య సంబంధాన్ని మరో కోణంలో చూపించింది. ముస్లిం సాహిత్యం గుర్తింపు, భద్రత, సంస్కృతి వంటి ప్రశ్నలను ముందుకు తెచ్చింది. మహిళా సాహిత్యం కుటుంబం, శరీరం, స్వేచ్ఛ, పితృస్వామ్య సంబంధాలపై కొత్త దృష్టిని తీసుకొచ్చింది. అందువల్ల వీటిని కేవలం ‘వర్గ సాహిత్యం’గా కాకుండా తెలుగు సాహిత్యాన్ని విస్తరించిన సృజనాత్మక ప్రవాహాలుగా చూడాలి. సంచికలో సాహిత్య విమర్శకు సంబంధించిన వ్యాసాలు రావడం కూడా గమనించదగిన విషయం. ‘సాహిత్య విమర్శ ఎలా వుండాలి?’ అనే ప్రశ్నకు నిజానికి ఒకే సమాధానం ఉండదు.

కానీ ఒక విషయం మాత్రం స్పష్టం—విమర్శ ప్రశంసగా మారకూడదు. రచయితను గౌరవించడం వేరు; రచనను విమర్శించడం వేరు. సాహిత్య విమర్శ రచనలోని బలాన్ని చెప్పడమే కాకుండా దాని పరిమితులను కూడా చూపాలి. ముఖ్యంగా దశాబ్ద సాహిత్యాన్ని సమీక్షించే సందర్భంలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. ఈ సంచికలోని ముఖాముఖీలు మరో విలువైన అంశం. ఎస్వీ సత్యనారాయణ, సి.మృణాళిని, నందిని సిధారెడ్డి, నలిమెల భాస్కర్, గోరేటి వెంకన్న, ముదిగంటి సుజాతారెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ప్రసేన్, స్కైబాబా, బి.ఎస్. రాములు, అఫ్సర్ తదితరులతో సంభాషణలు ఒక తరం సాహిత్య జ్ఞాపకాలను భద్రపరుస్తాయి. రచయితల స్వీయ అనుభవాలు భవిష్యత్ పరిశోధనకు ఉపయోగపడే మౌఖిక ఆధారాలు. అయితే వాటిని ఇతర సాహిత్య ఆధారాలతో కలిపి చదివినప్పుడే వాటి చారిత్రక విలువ మరింత పెరుగుతుంది. సినిమా, నాటకం, బాలసాహిత్యం, అనువాదానికి ఇచ్చిన స్థానం కూడా సంచిక పరిధిని విస్తరించింది. సాహిత్యం పుస్తకంలో మాత్రమే ఉండదనే విషయాన్ని ఈ అంశాలు గుర్తుచేస్తున్నాయి. ముఖ్యంగా ‘తెలంగాణ సినిమా: ఒక సాంస్కృతిక ప్రశ్న’, ‘ఒక దశాబ్ది నాటక ప్రస్థానం’, ‘దశాబ్ది తెలంగాణ బాల సాహిత్యం’, ‘అనువాదాలలో తెలంగాణ సాహిత్యం ఒక అవలోకనం’, ‘ప్రవాస తెలంగాణ సాహిత్యం’ వంటి అంశాలు భవిష్యత్ పరిశోధనకు అనేక దారులు చూపుతున్నాయి. అయితే ఇంత విస్తృతమైన సంచికకు ఒక పరిమితి సహజంగానే ఉంటుంది.

ఇన్ని ప్రక్రియలు, ఇన్ని రచయితలు, ఇన్ని అంశాలు ఒకే చోట చేరినప్పుడు ప్రతి అంశంపై సమానమైన లోతైన విశ్లేషణ సాధ్యం కాదు. అందువల్ల ఈ సంచికను దశాబ్దపు సాహిత్యానికి తుది తీర్పుగా కాకుండా, భవిష్యత్ పరిశోధనకు ఉపయోగపడే విస్తృత సాహిత్య దస్తావేజుగా చూడటం సముచితం. ముఖ్యంగా 2014–2025 కాలంలో పెరిగిన డిజిటల్ సాహిత్యం, ఆన్‌లైన్ పత్రికలు, సామాజిక మాధ్యమాల సాహిత్య ప్రభావం వంటి అంశాలు మరింతగా పరిశీలించాల్సి ఉంది. మొత్తానికి, ‘తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్య ప్రత్యేక సంచిక–2026’ గత పదేళ్ల సాహిత్యాన్ని ఒకే అద్దంలో చూపించే ప్రయత్నం చేసింది. ఆ అద్దంలో ఉద్యమ జ్ఞాపకాలున్నాయి; కొత్త సామాజిక ప్రశ్నలున్నాయి; అస్తిత్వాల స్వరాలున్నాయి; కవిత్వం, కథ, నవల, పాటలున్నాయి; సినిమా, నాటకం, బాలసాహిత్యం, అనువాదం వంటి విస్తృత రంగాలున్నాయి. అంతకన్నా ముఖ్యంగా ఇంకా చర్చించాల్సిన అనేక ప్రశ్నలు కూడా ఉన్నాయి. దశాబ్దపు సాహిత్యాన్ని నమోదు చేయడం ఒక పని. దాన్ని ప్రశ్నించడం మరో పని. ఈ రెండింటి మధ్యే నిజమైన విమర్శ మొదలవుతుంది. ఆ అర్థంలో ఈ ప్రత్యేక సంచిక ఒక ముగింపు కాదు; తెలంగాణ సాహిత్యాన్ని మరోసారి చదవడానికి, దాని బలాలను – పరిమితులను పరిశీలించడానికి, వినిపించని గొంతులను వెతకడానికి, రాబోయే దశాబ్దపు సాహిత్య దిశను ఆలోచించడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన సాహిత్య ప్రయత్నం.



డా. ఇడికోజు శ్రీనివాసాచారి 9885349305

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్