నవతెలంగాణ-హైదారాబాద్: తిరుమల వేంకటేశ్వరుడి దర్శన టికెట్ల విషయంలో గందరగోళం నెలకొనడంతో యాత్రికులంతా నిరసనకు దిగారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రజల కోసం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శన టికెట్లను విక్రయాలు చేస్తోంది. ఒకప్పుడు శ్రీవాణి టికెట్లను ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేవారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారాయి. ఏ రోజుకు ఆ రోజే ఆయా టికెట్లను విక్రయం చేస్తున్నారు. శనివారం ఉదయం టికెట్ల జారీలో గందరగోళం నెలకొంది. వేకువజామున 4 గంటలకు ఆయా టికెట్లను జారీ చేస్తామని ముందుగా ప్రకటించింది టీటీడీ.
అయితే శుక్రవారంతోపాటు వీకెండ్ సెలవులు రావడంతో తిరుమలకు యాత్రికులు భారీగా తరలి వచ్చారు. తక్కువ సమయం ఉండడంతో శ్రీవాణి టికెట్ల కోసం భారీగా జనాలు తరలివచ్చారు. వారిని కంట్రోల్ చేయలేక శుక్రవారం అర్ధరాత్రి నుంచే టికెట్ల విక్రయాలు మొదలుపెట్టారు టీటీడీ అధికారులు. ఈ క్రమంలో రాత్రి తోపులాట చోటుచేసుకుంది. రాత్రి టికెట్లు ఇచ్చిన విషయం తెలియక శనివారం ఉదయం శ్రీవాణి టికెట్ విక్రయం కేంద్రానికి యాత్రికులు వచ్చారు. రాత్రి టికెట్లు ఇచ్చామని చెప్పడంతో వారంతా ఆందోళన చేశారు. టికెట్లు దొరక్కపోవడంతో అన్నమయ్య భవనం ఎదుట నిరసనకు దిగారు.
ఈ విషయం తెలియగానే విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి వెనక్కి పంపించారు. కొత్తగా తీసుకొచ్చిన నిర్ణయం వల్లే ఇలా జరిగిందని పలువురు అంటున్నారు. వరుసగా సెలవులు రావడంతో యాత్రికులతో తిరుమల ఏడు కొండలు కిక్కిరిశాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో దర్శనం మరింత ఆలస్యం కావచ్చని చెబుతున్నారు. వైకుంఠం-2, నారాయణగిరి షెడ్లు జనాలతో నిండిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు ప్రజల క్యూలైన్ ఉంది. వరుస సెలవులు రావడంతో అమాంతంగా రద్దీ పెరిగింది.