నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. భారత్ దాడులకు అల్లాడిపోయిన పాక్..శాంతిచర్చల పేరుతో కాళ్లబేరానికి వచ్చింది. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితి మారింది. ఆ తర్వాత సోమవారం సాయంత్రం కూడా ఇరు దేశాల డీజీఎంవోలు హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిపారు. సరిహద్దుల్లో బలగాలను తగ్గించేందుకు భారత్-పాకిస్థాన్‌లు అంగీకరించాయి. ఆపరేషన్ సిందూర్ విరమణపై తొలిసారి మీడియాతో జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ పంజాబ్ రాష్ట్రం జలందర్ జిల్లాలోని ఆదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లి సైనికులను ప్రధాని కలిశారు. ఈ తర్వాత భారత్ సైనికులతో కలిసి పీఎం ఫోటోలు దిగారు. భారత ఆర్మీ దైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలు మరవలేనివని ఆయన కొనియాడారు. ఆపరేషన్ సిందూర్‌తో ఇండియాన్ ఆర్మీ సత్తాను ప్రపంచానికి తెలియజేశారని, ఉగ్రవాదుల స్థావరాలను కూల్చివేసి పాక్‌కు గుణపాఠం చెప్పారని పీఎం మోడీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ లో దైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులను కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందని,దేశం కోసం మన సాయుధ దళాలు చేసే ప్రతిదానికీ భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని ప్రధాని మోడీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
