నవతెలంగాణ – హైదరాబాద్ : అదానీ కారణంగానే ప్రధాని మోడీ మోనం వహిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం మండిపడ్డారు. అదానీపై అమెరికాలో దర్యాప్తు కారణంగానే ట్రంప్ నుండి ”పదేపదే బెదిరింపులు” వస్తున్నప్పటికీ ప్రధానిమోడీ ప్రతిఘటించలేకపోతున్నారని, ఆయన చేతులు కట్టేసి ఉన్నాయని అన్నారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందున వచ్చే 24 గంటల్లో భారత్‌పై గణనీయంగా టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ బెదిరించిన సంగతి తెలిసిందే. అలాగే భారత్ తగిన వాణిజ్య భాగస్వామి కాదని అన్నారు.
ట్రంప్ ప్రకటన వెలువడిన మరుసటి రోజు రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ”భారతీయులారా దయచేసి అర్థం చేసుకోండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే బెదిరిస్తున్నప్పటికీ ప్రధాని మోడీ మోనం వహించడానికి కారణం అదానీపై అమెరికా దర్యాప్తు. మోడీ, ఎఎ(అదానీ, అంబానీ) మరియు రష్యా చమురు ఒప్పందాల మధ్య ఆర్థిక సంబంధాలను బహిర్గతం చేస్తే ముప్పు. మోడీ చేతులు బంధించబడ్డాయి” అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో పేర్కొన్నారు.