నవతెలంగాణ-హైదరాబాద్: పోర్చుగల్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఆంటోనియో జోస్ సెగురో అఖండ విజయం సాధించారు. ఆదివారం జరిగిన రెండో రౌండ్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తంగా 95.37 శాతం ఓట్లు పోలయ్యాయి. వీటిని లెక్కించినప్పుడు సోషలిస్టు పార్టీ (పిఎస్)కి చెందిన అధ్యక్ష అభ్యర్థి సెగురోకు 66.14 శాతం ఓట్లు రాగా, మితవాద చేగా పార్టీకి చెందిన వెంచురాకు 33.86 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత ఫలితాల ప్రకారం.. ఆంటోనియో అధ్యక్షుడిగా భారీ మెజార్జీతో ఎన్నికయ్యారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా కాల్డాస్ డ రైన్హాలో తన నివాసంలో సెగురో విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను చెప్పే మాట చాలా సింపుల్. పోర్చుగీస్ ప్రజలు ప్రపంచంలోనే అత్యత్తమ వ్యక్తులు. అద్భుతమైన వారు. వారు అపారమౌన పౌర బాధ్యత, ప్రజాస్వామ్య విలువలకు అనుబంధం కలిగి ఉన్నారు. అందుకే నాకీ విజయం దక్కింది’ అని అన్నారు.
కాగా, మొదటి రౌండ్ ఎన్నికలు ఈ ఏడాది జనవరి 18న జరిగాయి. రెండో రౌండ్ ఫిబ్రవరి ఫిబ్రవరి 8 (ఆదివారం) జరిగాయి. ఆదివారం పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన ఎగ్జిట్‌పోల్స్ కూడా ఆంటోనియోకే మొగ్గుచూపాయి. ఎగ్జిట్‌పోల్స్ సెగురోకి 67-71 శాతం ఓట్లు, వెంచురాకు 27-38 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి. పోర్చుగల్‌లో పదేళ్లు మితవాద పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ సోషలిస్టు ప్రభుత్వం అక్కడ కొలువుదీరనుంది.
ఆదివారం పోలింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేదు. నిన్న మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడచిన రెండు వారాలుగా పోర్చుగల్‌ని తుఫానులు, వరదలు అతలాకుతలం చేశాయి. వరదల వల్ల ఎనిమిది మంది మృతి చెందారు. అయినప్పటికీ ఓటర్లు పోలింగ్ బూతులకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుని సోషలిస్టు పార్టీకి భారీ మెజార్టీనిచ్చారు.



