నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. బీహార్, పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన రూ.12,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తారు. బీహార్‌లోని మోతిహారీలో ఉదయం 11:30కి రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులు రైల్వే, రోడ్లు, గ్రామీణాభివృద్ధి, ఫిషరీస్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలకు సంబంధించినవి.
మోతీహారీలోని గాంధీ మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆయన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా, దీనదయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ రూరల్ లైవ్‌లీహుడ్స్ మిషన్ (DAY-NRLM) కింద బీహార్‌లోని 61,500 స్వయం సహాయక బృందాలకు రూ.400 కోట్లు విడుదల చేస్తారు. అలాగే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ కింద 12,000 మంది లబ్ధిదారులకు గృహ ప్రవేశం కోసం తాళం కీలు ఇస్తారు. 40,000 మందికి రూ.160 కోట్లు విడుదల చేస్తారు. ఇంకా, దర్భంగాలో కొత్త సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (STPI) సౌకర్యం, పాట్నాలో STPIకి చెందిన అత్యాధునిక ఇంక్యుబేషన్ సౌకర్యాన్ని ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు, మోడీ పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో రూ.5,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులు ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రైల్వే, రోడ్ల రంగాలకు సంబంధించినవి. బంకురా, పురూలియా జిల్లాల్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) ప్రాజెక్టు కోసం రూ.1,950 కోట్లతో శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.